రేపు యాదాద్రికి సీజేఐ..

13 Jun, 2021 08:47 IST|Sakshi

సీఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు సందర్శించనున్న జస్టిస్‌ ఎన్వీ రమణ

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. శనివారం సీజేఐను కేసీఆర్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యాదాద్రి సందర్శిం చాలని కోరగా, సీఎం ఆహ్వానాన్ని మన్నించి జస్టిస్‌ ఎన్వీ రమణ సోమవారం యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన జస్టిస్‌ ఎన్వీ రమణ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. తొలుత ఆదివారం సీజేఐతో పాటు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్‌ వెళ్తారని వార్తలు వచ్చాయి.

అయితే సోమవారం సీజేఐ ఒక్కరే పర్యటిస్తారని దేవాలయ వర్గాలు తెలిపాయి. ముందుగా బాలాలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం కొత్తగా నిర్మిస్తున్న ప్రధానాలయాన్ని పరిశీలిస్తారు. సీజేఐ పర్యటన నేపథ్యంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత శనివారం యాదాద్రికి చేరుకుని ఏర్పాట్లపై జిల్లా పరిపాలనా యంత్రాంగం, వైటీడీఏ అధికారులతో సమీక్షించారు. కాగా, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజ్‌భవన్‌లో జస్టిస్‌ ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు.
చదవండి: Telangana: విత్తు.. విపత్తు 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు