మిర్చి రైతులకు పరిహారం ఇవ్వండి: తమ్మినేని

27 Dec, 2021 03:17 IST|Sakshi
మిరప మొక్కలను పరిశీలిస్తున్న తమ్మినేని 

కొణిజర్ల: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అంతుబట్టని వైరస్‌తో మిరప తోటలు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లక్ష్మీపురంలో ఆదివారం ఆయన భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబూరావు, స్థానిక సీపీఎం, రైతు సంఘం నాయకులతో కలిసి వైరస్‌తో దెబ్బతిన్న మిరప తోటలను పరిశీలించారు.

ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ మిర్చి పంట గులాబీ, తామర పురుగులతో దెబ్బతిన్నదని, 80 వేల ఎకరాల్లో పంట నష్టపోయి రైతులు అప్పుల్లో కూరుకుపోయారని తెలిపారు. మిర్చి రైతులకు సలహాలు, సూచనలు అందించడంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వ్యవసాయ, కీటక శాస్త్రవేత్తలు కూడా పరిశీలించి ఏమీ తేల్చకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

పంటలు పూర్తిగా నష్టపోవడంతో కౌలురైతుల పరిస్థితి దయనీయంగా మారిందని వాపోయారు. రైతులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని, పరిహారం ఇప్పించే వరకు పోరాటం చేస్తామని తమ్మినేని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు సుదర్శన్, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  

స్థానికతకు ప్రాధాన్యమిచ్చేలా సవరణలుండాలి
సాక్షి, హైదరాబాద్‌: అసంబద్ధ, లోపభూయిష్టమైన 317 జీవోను సమీక్షించి ఉద్యోగుల స్థానికతకు ప్రాధాన్యమిచ్చేలా సవరణలు చేయాలని సీఎం కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం లేఖ రాశారు. ఆ లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో నూతన జోనల్‌ వ్యవస్థ అమల్లో భాగంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317 లోపభూయిష్టంగా ఉందన్నారు.

ఒక పెద్ద మార్పు జరిగే సందర్భంలో ఆ మార్పు వల్ల ప్రభావితమయ్యే వర్గాల ప్రతినిధులతో మాట్లాడి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే సానుకూలంగా పరిశీలించి, జోక్యం చేసుకుని పరిష్కరించాలని తమ్మినేని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన అసంబద్ధ ఉత్తర్వుల కారణంగా ఉద్యోగులు ప్రధానంగా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఉన్న ఊరును, సొంత జిల్లాను వదిలి పెట్టి మరొక జిల్లాకు శాశ్వతంగా వెళ్లాల్సిన దుస్థితి కల్పించారని విమర్శించారు.

స్థానికత ఆధారంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించిన మీరే స్థానికత పునాదులను ధ్వంసం చేయబూనుకోవటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఇతర జిల్లాలకు బలవంతంగా బదిలీ అయిన ఉపాధ్యాయులు 10 వేల మంది ఉంటారని, అవసరమైతే సూపర్‌ న్యూమరరీ పోస్టులను కేటాయించి వారి సొంత జిల్లాలకు తీసుకురావాలని కోరారు. 

మరిన్ని వార్తలు