పెన్షన్‌.. పరేషాన్! నగదు జమ కాక లబ్ధిదారుల ఆందోళన

27 Dec, 2022 13:56 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌: ఆసరా పింఛన్‌లకు తిప్పలు తప్పడం లేదు. తాజాగా బ్యాంక్‌ ఖాతాలకు కేవైసీ ప్రక్రియ చిక్కుముడిగా తయారైంది. బ్యాంకు ఖాతాల ద్వారా కొంత కాలంగా ఆసరా పింఛన్‌ పొందుతున్న లబ్ధిదారులు కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో రెండు, మూడు నెలలుగా పింఛన్‌ సొమ్ము జమకాని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆధార్‌ అప్‌డేట్‌ సమస్య కూడా వెంటాడుతోంది. లబ్ధిదారులు తహసీల్‌ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా సమస్యకు సరైన సమాధానం లభించని పరిస్థితి నెలకొంది. దీంతో పేదలు పింఛన్ల కోసం ఆందోళన చెందుతున్నారు.

కార్డుల పంపిణీలో నిర్లక్ష్యమే
ఆసరా పింఛన్‌ గుర్తింపు కార్డుల పంపిణీలో తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. ఇటీవల కొత్తగా పింఛన్లు మంజూరైన వారిలో పాటు పాత లబ్ధిదారులకు సైతం ప్రభుత్వం ఆసరా గుర్తింపు కార్డులను ముద్రించింది. లబి్ధదారులు ఇళ్లు మారడంతో పాటు పంపిణీకి చిరునామా సమస్య తలెత్తింది. దీంతో సగానికి పైగా కార్డులు తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. కనీసం వార్డుల సమావేశాలు నిర్వహించి పంపిణీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కేవలం ఎమ్మెల్యేల ద్వారా కొన్ని కార్డులు పంపిణీ చేసి చేతులు దులుపుకొన్నారు.

ఇటీవల 65 ఏళ్ల వృద్ధులతో పాటు 57 ఏళ్లు నిండిన వారికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరయ్యాయి. తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు గతేడాది మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు పెట్టుకున్న అర్హులకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తోంది. బ్యాంక్‌ ఖాతాకు కేవైసీ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ప్రధాన సమస్యగా పరిణమించింది.
చదవండి: Revanth Reddy: రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ?.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం..

మరిన్ని వార్తలు