లాక్‌డౌన్‌ ప్రజలకే కాదు.. నగరాల్లోని కాలుష్యానికి కూడా..

16 May, 2021 15:24 IST|Sakshi

5 రోజుల్లోనే గ్రీన్‌జోన్‌లోకి తెలంగాణ, ఏపీ నగరాలు 

లాక్‌డౌన్‌ కారణంగా నగరాల్లో తగ్గిన కాలుష్యం

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ విధింపుతో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గిపోయింది. నిత్యం కాలుష్యంతో నిండిపోయే నగరాల్లో ప్రస్తుతం స్వచ్ఛ వాయువులు వీస్తున్నాయి. కొన్నినెలల విరామం తర్వాత మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాలు ‘గ్రీన్‌జోన్‌’లోకి అడుగుపెట్టాయి. వాయు నాణ్యతలో ‘గుడ్‌ కేటగిరీ’లోకి చేరుకున్నాయి. లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలవుతుండడంతో అన్నిరకాల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇతర కార్యకలాపాలు సైతం నిలిచిపోవడంతో గత ఐదురోజుల్లోనే పర్యావరణ పరంగా ఎంతో మేలు జరిగినట్టు నిపుణులు చెబుతున్నారు.

నగరాల్లో తగ్గిన కాలుష్యం
గతేడాది దాదాపు 2, 3 నెలల లాక్‌డౌన్‌తో కాలుష్యం గణనీయంగా తగ్గిపోయింది. జన సంచారం సైతం లేకపోవడంతో వన్యప్రాణులు, జంతువులు, పక్షులు స్వేచ్ఛగా సంచరిస్తూ గ్రామాలు, పట్టణ శివార్లలోకి కూడా వచ్చి కనువిందు చేశాయి. అయితే లాక్‌డౌన్‌ ఎత్తేశాక రెండంటే రెండు రోజుల్లోనే అన్నిరకాల కాలుష్యం పెరిగిపోయి మళ్లీ యధాతథ స్థితికి చేరుకుంది. అప్పటి నుంచి వాయు, తదితర కాలుష్యాలు పెరుగుతూనే వచ్చాయి. తాజాగా మరోసారి లాక్‌డౌన్‌ విధించడంతో ఐదురోజుల్లోనే వాయుకాలుష్యం గణనీయంగా తగ్గి నగరాలు గుడ్‌ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏఐక్యూ)లోకి చేరుకున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ‘సమీర్‌ యాప్‌’ద్వారా రియల్‌ టైమ్‌లో దేశవ్యాప్తంగా వందకు పైగా ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో వాయు నాణ్యత, వివిధ రకాల కాలుష్య స్థాయిలను పరిశీలించి ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ గణాంకాల సూచీని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు వెల్లడిస్తోంది. ఎన్ని పాయింట్లు ఉంటే ఏ విధమైన ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందో కూడా తెలియజేస్తోంది. 
సీపీసీబీ అప్‌డేట్‌ ఇదీ.. 
శనివారం సాయంత్రం 7.05 నిమిషాలకు సీపీసీబీ అప్‌డేట్‌ చేసిన ఏక్యూఐ తాజా వివరాల ప్రకారం..  హైదరాబాద్‌లో వాయు నాణ్యత 29 పాయింట్లుగా రికార్డు కాగా, ఏపీ రాజధాని అమరావతిలో 20 పాయింట్లు, రాజమండ్రిలో 27, తిరుపతిలో 43, ఏలూరులో 47, విశాఖలో 53 పాయింట్లు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్‌ మహానగరం మొత్తంగా సగటున 29 పాయింట్లుగా నమోదు కాగా, వివిధ ప్రాంతాల వారీగా చూస్తే మల్లంపేట, బాచుపల్లిల సమీపంలో 19 పాయింట్లు, పటాన్‌చెరు దగ్గర 25 పాయింట్లు, శేరిలింగంపల్లి, కొండాపూర్‌ల సమీపంలో 30 పాయింట్లు, నెహ్రు జూ పార్కు దగ్గర 41 పాయింట్ల ఏక్యూఐ రికార్డయ్యింది.

( చదవండి: కరోనా వ్యాక్సిన్‌: స్పుత్నిక్‌–వి భేష్‌.. సామర్థ్యం ఎంతంటే? )

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు