తెలంగాణ.. పాకిస్తాన్‌లో కలిసేదేమో! 

1 Nov, 2021 02:26 IST|Sakshi
కూకట్‌పల్లిలో జరిగిన రన్‌ ఫర్‌ యూనిటీ ర్యాలీలో భారీ జాతీయ జెండాను ప్రదర్శించిన కార్యకర్తలు 

సర్దార్‌పటేల్‌ వల్లే హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైంది

వల్లభ్‌ భాయ్‌ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ నేతలు

సాక్షి, హైదరాబాద్‌/ఆమనగల్లు/కూకట్‌పల్లి: దేశ స్వాతంత్య్ర అనంతరం ఏర్పడిన జాతీయ ప్రభుత్వంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ హోంమంత్రిగా ఉండకపోయి ఉంటే తెలంగాణ ప్రాంతం పాకి స్తాన్‌లో కలిసేదేమోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం సర్దార్‌ పటేల్‌ 146వ జయంతిని పురస్కరించుకుని అసెంబ్లీ సమీపంలోని పటేల్‌ విగ్రహానికి సంజయ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలం గాణ పాకిస్తాన్‌లో కలిస్తే కేసీఆర్‌ సీఎం అయ్యేవారు కాదన్నారు.

డా.బాబాసాహెబ్‌ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్, మహాత్మా పూలే, గాంధీజీ, సర్దార్‌ పటేల్‌ వంటి మహనీయుల జయంతి కార్య క్రమాల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొనకపోవడాన్ని సంజయ్‌ ఖండించారు. నిజాంను మాత్రం కేసీఆర్‌ పొగుడుతారు కాబట్టే ఆయనను తాము చాంద్‌ పాషాగా అభివర్ణిస్తున్నామని చెప్పారు. కేసీఆర్‌ వ్యవహారశైలిని తెలంగాణ ప్రజలు గమని స్తున్నారని, సందర్భం వచ్చినప్పుడు సరైన బుద్ధి చెబుతారని అన్నారు.

కమ్యూనిస్టుల సాయుధ పోరాటంతోనో, కాంగ్రెస్‌ సత్యాగ్రహాలతోనో హైద రాబాద్‌ రాష్ట్ర విమోచన జరగలేదని పేర్కొన్నారు. తెలంగాణ గడ్డకు విమోచన కల్పించిన సర్దార్‌ పటేల్‌ జయంతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ ఎందుకు పాల్గొనరని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసే విషసంస్కృతిని సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చారని సంజయ్‌ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సిం హారెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజూరాబాద్‌ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఓటుకు రూ.6 వేల నుంచి రూ.20 వేలదాకా టీఆర్‌ఎస్‌ నాయకులు పంపిణీ చేశారని ఆరోపించారు.

హుజూరాబాద్‌ ఈవీఎంలను ప్రైవేటు వాహనంలో తరలించడంపై ఉన్నతస్థాయి విచారణ జరిపి వాస్తవాలు బహిర్గతపరచాలని డిమాండ్‌ చేశారు. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వ్యవహరించిన తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద నల్లబ్యాడ్జీలతో రెండు రోజులపాటు నిరసనలు చేపట్టనున్నట్లు వెల్ల డించారు. వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్బంగా నిజాంపేట వద్ద కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో ఆదివారం రన్‌ ఫర్‌ యూనిటీ ర్యాలీ కార్యక్రమం నిర్వ హించారు. బండి సంజయ్, బీజేపీ మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌చార్జి మురళీధర్‌రావు ర్యాలీ ప్రారంభిం చారు. యువతలో దేశభక్తి నింపడం కోసమే రన్‌ ఫర్‌ యూనిటీ నిర్వహించినట్లు చెప్పారు.

>
మరిన్ని వార్తలు