Munugode Politics: ఒక్క ఉప ఎన్నిక.. రెండు పార్టీలకు దెబ్బ!

13 Aug, 2022 03:39 IST|Sakshi

మునుగోడులో గెలుపుతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు చెక్‌ పెట్టడంపై బీజేపీ నజర్‌

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించి, నల్లగొండ జిల్లాలో కాషాయ జెండా ఎగరవేయడం ద్వారా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ధీమా పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈక్రమంలోనే ఎక్కడా చిన్న అవకాశం కూడా వదులుకోకుండా.. ఉప ఎన్నికపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరికను ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లి కాంగ్రెస్‌ పార్టీకి చెక్‌ పెట్టాలని.. చేరికలు, ఇతర మార్గాల ద్వారా టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలని భావిస్తోంది.

ఈ నెల 21న అమిత్‌షా సభ నిర్వహించడం, ఆ సభలోనే రాజగోపాల్‌రెడ్డి సహా పలువురు కీలక నేతలు బీజేపీలో చేరనుండటం ఈ వ్యూహంలో భాగమేనని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. శుక్రవారం బండి సంజయ్‌ పాదయాత్ర మధ్యలో నిర్వహించిన సమావేశం సందర్భంగా.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ప్రదీప్‌రావు, బొమ్మ శ్రీరాం తదితరులు తరుణ్‌ చుగ్‌తో భేటీఅయ్యారు. 21న అమిత్‌ షా సభ సందర్భంగా బీజేపీలో చేరనున్నారని, ఈ మేరకు చర్చలు జరిపారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కు చెక్‌
కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్‌ రెడ్డి.. ఆ పార్టీపై ఎలాంటి విమర్శలూ చేయలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తమ పట్ల వ్యతిరేకతతో వ్యవహరించాడని.. ఆయన కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాశనమవుతోందనే ఆరోపణలు చేశారు. తద్వారా కాంగ్రెస్‌ శ్రేణుల నుంచి వ్యతిరేకతను తగ్గించుకోగలిగారు. అంతేగాకుండా రాజగోపాల్‌రెడ్డితోపాటు నియోజకవర్గ కాంగ్రెస్‌ నేతలు కొందరు బీజేపీలో చేరుతున్నారు.

తద్వారా ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు చెక్‌ పెట్టవచ్చని బీజేపీ నేతలు అంటున్నారు. ఇక బీజేపీ టీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుంది. బండి పాదయాత్ర, బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకుల పర్యటనలన్నీ టీఆర్‌ఎస్, కేసీఆర్, ఆయన కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తూ జనంలోకి వెళుతున్నవే. 21న మునుగోడు నియోజకవర్గంలో జరిగే అమిత్‌షా సభలోనూ టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా చేసుకోనున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

అట్టహాసంగా అమిత్‌ షా సభ
మునుగోడుతోపాటు తెలంగాణ ప్రజలను ఆకర్షించేందుకు అమిత్‌ షా సభను అట్టహాసంగా నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. గణనీయ సంఖ్యలో జనాన్ని తరలించి అమిత్‌షా సభను విజయవంతం చేయడం, పార్టీలో చేరికల విషయంలో పకడ్బందీగా వ్యవహరించడం, ఉప ఎన్నిక ఊపుతో పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 

మరిన్ని వార్తలు