తెలంగాణ సిగలో మరో అందం: వెలుగులోకి కొత్త జలపాతం

31 Aug, 2021 08:03 IST|Sakshi

అటవీ ప్రాంతంలో మరో జలపాతం వెలుగులోకి

నిర్మల్‌ జిల్లాలో ఆకట్టుకుంటున్న బ్రహ్మేశ్వరం జలపాతం

ప్రకృతి ఒడిలో పురాతన శివాలయం

శ్రావణమాసంలో భక్తుల సందడి

భైంసా టౌన్‌: 200 ఏళ్లకుపైగా పురాతన శివాలయం, ప్రకృతి ఒడిలో, పచ్చని చెట్ల మధ్య వెలిసింది. పక్కనే జలపాతం అందాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చుట్టూ పచ్చని చెట్లు, ఎతైన గుట్టలు, పక్కనే జాలువారే జలపాతం.. వీటి మధ్యన వెలిసిన పురాతన శివాలయం.. వెరసి కుభీర్‌ మండలంలోని బ్రహ్మేశ్వరాలయం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రావణమాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో పూజలు చేసేందుకు శని, సోమవారాల్లో భక్తులు అధికసంఖ్యలో వస్తుంటారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు మహారాష్ట్ర నుంచి సైతం తరలివచ్చి పూజలు చేస్తారు.

గ్రామం: బ్రహ్మేశ్వర్, మండలం: కుభీర్‌
భైంసా నుంచి దూరం: 20 కి.మీ(దాదాపు)

ఆలయ చరిత్ర...
బ్రహ్మేశ్వర ఆలయానికి దాదాపు 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. వనవాసం సమయంలో రామలక్ష్మణులు, సీత ఇక్కడ సంచరించారని, శివలింగం ప్రతిష్ఠించి పూజలు చేశారని నమ్ముతారు. తమ తాతల కాలం నుంచి ఆలయం ఉందని, శివరాత్రితోపాటు ఏటా శ్రావణమాసంలో భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారని చెబుతున్నారు. 

ఆకట్టుకునే వాతావరణం..
భైంసా నుంచి దాదాపు 20కి.మీ దూరంలో ఉండే బ్రహ్మేశ్వర్‌ గ్రామంలోని బ్రహ్మేశ్వరాలయం పరిసరాలు, అక్కడి వాతావరణం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఆలయ సమీపంలోని జలపాతంలో స్నానాలు చేస్తుంటారు. పచ్చని ప్రకృతి ఒడిలో సేదదీరేందుకు దూరప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చి సత్యనారాయణ వ్రతాలు చేస్తుంటారు.

పురాతన ఆలయంగా ప్రసిద్ధి..
కొత్త పంచాయతీలతో బ్రహ్మేశ్వర్‌ జీపీగా ఏర్పడింది. ఇక్కడి శివాలయానికి దాదాపు 200ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల గ్రామాలతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తుంటారు.
- దత్తురాం, బ్రహ్మేశ్వర్‌ గ్రామస్తుడు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు