కోమటిరెడ్డి పొత్తు కామెంట్స్‌పై కాంగ్రెస్‌ సీరియస్‌! ఆనాడే చర్యలు తీసుకుని ఉంటే..

14 Feb, 2023 15:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ‘పొత్తు’ వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలతో అటు అధికార బీఆర్‌ఎస్‌, ఇటు బీజేపీ రెండూ.. కాంగ్రెస్‌ తీరును ఏకిపడేస్తున్నాయి. ఈ తరుణంలో..   

కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ స్పందించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలంతా కోమటిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల వేళ ఇలాంటి వ్యాఖ్యలు కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తాయని చెబుతున్నారు పలువురు కాంగ్రెస్‌ నేతలు. మరోవైపు కోమటిరెడ్డి కామెంట్స్‌ వీడియోను రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే పరిశీలించినట్లు తెలుస్తోంది. 

ఈ మేరకు కోమటిరెడ్డి కామెంట్లపై ఠాక్రే.. కోమటిరెడ్డి కామెంట్లపై ఆరా తీసినట్లు సమాచారం. ఈ క్రమంలో.. అధిష్టానానికి నివేదిక అందించినట్లు తెలుస్తోంది. అంతేకాదు రేపు(గురువారం) ఉదయం ఆయన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో విడిగా భేటీ అవుతారని తెలుస్తోంది. ఇంకోవైపు రేవంత్‌ వర్గం ‘కోమటిరెడ్డి వ్యాఖ్యలు’ పార్టీకి తీరని నష్టం చేస్తాయని అంటోంది. అంతేకాదు.. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే గెలిచే సత్తా కాంగ్రెస్‌కు ఉందని చెబుతోంది రేవంత్‌ వర్గం.

ఆనాడే కోమటిరెడ్డి చర్య తీసుకునేది ఉండే!
కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు సహ నేత అద్దంకి దయాకర్. వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీకి నష్టం కల్గించేలా ఉన్నాయి. వెంకట్ రెడ్డి ప్రతిసారీ పార్టీకి నష్టం కలిగేలా ప్రవర్తిస్తున్నారు. క్యాడర్ మనోధైర్యం దెబ్బతీసేలా వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ పై సీరియస్ గా తీసుకోవాలి. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు ఆయనపై హైకమాండ్ యాక్షన్ తీసుకొని ఉంటే.. ఇప్పుడు ఇలా మాట్లాడే వాడు కాదు. 
::: అద్దంకి దయాకర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి

బీఆర్‌ఎస్‌కే ఆ అవసరం ఉండొచ్చు!
బీఆర్ఎస్ తో పొత్తు విషయం ఎవరు మాట్లాడినా అది వ్యక్తిగతం తప్ప పార్టీకి సంబంధం లేదు. రాష్ట్రంలో బిఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయింది. ఓటమి అంచున ఉన్నది. బీఆర్ఎస్‌ను ఓడించే పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ఓటమి అంచున ఉన్న బీఆర్‌ఎస్‌కు పొత్తులు అవసరం ఉండొచ్చు కానీ, కాంగ్రెస్‌కు ఆ అవసరం లేదు. గతంలోనే తెలంగాణ సభలో కాంగ్రెస్ పార్టీకి ఎవరితో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ స్పష్టం చేయశారు. అంతేకాదు.. పొత్తు గుతించి మాట్లాడితే చర్యలు తీసుకుంటాం అన్నారు కూడా.  రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన పూర్తి మెజార్టీ తో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వస్తోంది. 
:::మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

ఇదీ చదవండి: తెలంగాణలో వచ్చేది హంగ్‌ అసెంబ్లీనే: కోమటిరెడ్డి

మరిన్ని వార్తలు