Somesh Kumar: తెలంగాణలో సోమేశ్‌ ‘ముద్ర’.. అనేక రాజకీయ విమర్శలను ఎదుర్కొని

11 Jan, 2023 16:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్‌.సోమేశ్‌కుమార్‌ తనదైన ముద్ర వేసుకున్నారు. మూడేళ్ల క్రితం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎస్‌.కె.జోషి నుంచి ప్రభుత్వ శాఖల పాలన పగ్గాలు తీసుకున్న ఆయన.. అనేక రాజకీయ విమర్శలను, ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా తనదైన శైలిలో ప్రభుత్వ వ్యవస్థను ముందుకు నడిపిన ఐఏఎస్‌ అధికారిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ప్రభుత్వానికి ఆదాయ వనరులను సృష్టించడంలో దిట్టగా పేరొందారు.

ఎక్సైజ్, రిజిస్టేషన్లు, వాణిజ్య పన్నుల శాఖల ద్వారా ఆదాయాన్ని రెండు, మూడింతలు చేయడంలో కీలకపాత్ర పోషించిన ఆయన ఆయా శాఖల్లో కీలక సంస్కరణలు చేపట్టారు. రాష్ట్రంలోని చిట్‌ఫండ్‌ కంపెనీల ఇష్టారాజ్యాన్ని నియంత్రించేలా మార్పులు తెచ్చారు. ఆబ్కారీ శాఖలో హోలోగ్రామ్‌ విధానాన్ని తెచ్చి కల్తీ, నాన్‌డ్యూటీ పెయిడ్‌ మద్యాన్ని నియంత్రించడంతోపాటు ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ విధానం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా మార్పులు తెచ్చారు.

వాణిజ్య పన్నుల శాఖను పునర్వ్యవస్థీకరించి పన్ను ఎగవేతలను సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఆదాయ శాఖలన్నింటిలో తనదైన ముద్ర వేసిన సోమేశ్‌.. ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తేవడం ద్వారా వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో పారదర్శకతను తెచ్చారు. అయితే, ఈ పోర్టల్‌ అమల్లో అనేక విమర్శలు కూడా వచ్చాయి. రైతుల భూములకు సంబంధించిన సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.  

ల్యాండ్‌ బ్యాంక్‌ రూపకల్పన 
నిరర్ధక ఆస్తులు, భూములను అమ్మి ప్రభుత్వ ఖజానా నింపడం, టీఎస్‌ఐఐసీ లాంటి సర్వీస్‌ ప్రొవైడర్‌ ద్వారా భూములను విక్రయించే పద్ధతిని సోమేశ్‌కుమార్‌ తీసుకొచ్చారు. లెక్కాపత్రం లేని ప్రభుత్వ భూముల వివరాలను పక్కాగా తయారు చేసి భవిష్యత్తు అవసరాల కోసం ల్యాండ్‌ బ్యాంక్‌ను రూపొందించడం లాంటి పనులు కూడా ఆయన హయాంలోనే జరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల పోస్టింగులకు సంబంధించిన పైరవీలకు సోమేశ్‌ చెక్‌ పెట్టారనే వాదన కూడా ఉంది. ఏటా అన్ని శాఖల్లో ఆడిటింగ్‌ను క్రమం తప్పకుండా నిర్వహించడం ద్వారా జవాబుదారీతనం పెంపు కోసం యత్నించారు.

ఇక జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన కాలంలో డోర్‌ టు డోర్‌ సర్వే, రూ.ఐదుకే భోజనం, ఎస్‌ఆర్‌డీపీ (స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం) కింద ఫ్లైఓవర్ల నిర్మాణం, మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాళ్ల నిర్మాణం లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జీహెచ్‌ఎంసీలో కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసి ప్రజలు సులవుగా ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించింది కూడా ఈయన హయాంలోనే. ఈ కాల్‌సెంటర్‌ కోవిడ్‌ సమయంలో చాలా ఉపయోగపడిందనే పేరుంది.   

మరిన్ని వార్తలు