దరఖాస్తుకు రెండో‘సారీ’

9 Jan, 2022 01:35 IST|Sakshi

నిషేధిత జాబితాలో పట్టా భూములున్న వాళ్లకు ‘ధరణి’లో మరో సమస్య

ఆ జాబితా నుంచి భూములను తొలగించేందుకు రెండోసారి దరఖాస్తు తీసుకోని పోర్టల్‌ 

కలెక్టర్‌ గతంలోనే తిరస్కరించారంటూ నిరాకరణ

అన్ని ఆధారాలతో దరఖాస్తు చేసుకుందామంటే అవకాశమివ్వని వైనం

తమ చేతిలో ఏం లేదంటున్న రెవెన్యూ వర్గాలు

ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇస్తేనే మరోసారి అవకాశం!

సాక్షి, హైదరాబాద్‌: నిషేధిత జాబితాలో పట్టా భూములున్న రైతులు, భూ యజమానులకు ధరణి పోర్టల్‌లో మరో సమస్య వచ్చిపడింది. ఆ జాబితా నుంచి భూములను మినహాయించాలని రెండోసారి దరఖాస్తు చేసుకునేందుకు పోర్టల్‌లో వీలు లేకుండా పోయింది. సదరు భూమిపై ఉన్న దరఖాస్తును కలెక్టర్‌ గతంలోనే తిరస్కరించారంటూ రెండోసారి దరఖాస్తును పోర్టల్‌ నిరాకరిస్తోంది. దీంతో రైతులు, భూ యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

తిరస్కరించి.. తిరకాసు పెట్టి
రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల పట్టా భూములు ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితాలో కనబడుతున్నాయి. పట్టా భూములున్న సర్వే నెంబర్‌లో కొంత ప్రభుత్వ భూమి ఉండటం, కొంత భూమిని ప్రభుత్వం సేకరించడం, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ భూములుండటం, సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించిన భూములు ఉండటంతో ఆ సర్వే నెంబర్‌ మొత్తాన్నీ నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో ఆ సర్వే నెంబర్‌లో భూములున్న యజమానులు 15 నెలలుగా పడరాని పాట్లు పడుతున్నారు.

తమ భూమిపై ఎలాంటి లావాదేవీలకూ ఆస్కారం లేకపోవడంతో ‘మినహాయించండి ప్రభో’అని పోర్టల్‌ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి మొరపెట్టుకుంటున్నారు. మొదట్లో అసలు స్పందించని ప్రభుత్వ వర్గాలు 6 నెలల క్రితమే ఓ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చాయి. నిషేధిత జాబితాలో చూపెడుతున్న పట్టా భూములను ఆ జాబితా నుంచి తొలగించేందుకు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చాయి. దీంతో ధరణి పోర్టల్‌ ద్వారా లక్షలాది దరఖాస్తులు వచ్చాయి.

కలెక్టర్లు ఎడాపెడా తిరస్కరించడంతో..
ధరణి పోర్టల్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులను కలెక్టర్‌ లాగిన్‌ నుంచి పరిష్కరించాల్సి ఉండటంతో ఇందులో చాలా జాప్యం జరిగింది. కొందరు రైతులు అన్ని ఆధారాలను సమర్పించలేకపోవడం, రెవెన్యూ వర్గాల వద్ద లభ్యంగా ఉన్న రికార్డులు సమగ్రంగా లేకపోవడంతో కొన్ని దరఖాస్తులను తిరస్కరించారు. చాలా తక్కువ సంఖ్యలోనే ఆమోదించారు. దీంతో పోర్టల్‌లో పెండింగ్‌ దరఖాస్తులు పెరిగిపోతున్నాయని, వెంటనే అన్నీ క్లియర్‌ చేయాలని గతేడాది నవంబర్‌లో కలెక్టర్లను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు.

దీంతో కలెక్టర్లు ఆ దరఖాస్తులను సుమోటోగా స్వీకరించి తూతూ మంత్రపు పరిశీలనతో ఎడాపెడా తిరస్కరించేశారు. దరఖాస్తును తిరస్కరించారని తెలుసుకున్న రైతులు అన్ని ఆధారాలతో ఇప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లగా అసలు దరఖాస్తు చేసుకునే అవకాశమే లేకుండా పోవడంతో రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. 

తమకు సంబంధం లేదంటున్న రెవెన్యూ వర్గాలు
నిషేధిత భూముల జాబితా నుంచి మినహాయింపు కోసం తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన రైతులు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడం కోసం అదే బాట పడుతున్నారు. అయితే తమ చేతుల్లో ఏం లేదని రెవెన్యూ వర్గాలు చేతులెత్తేయటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు దరఖాస్తులు పూర్తి స్థాయిలో క్లియర్‌ చేయలేదని, అవి క్లియర్‌ అయ్యాక ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతినిస్తేనే మళ్లీ దరఖాస్తుకు అవకాశం ఉంటుందని చెబుతున్నాయి.

ఇందుకు కనీసం నెల సమయం పడుతుందని సెలవిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఎప్పటికి అవకాశమిస్తుందో, అసలు ఇస్తుందో ఇవ్వదో, తమ పట్టా భూములు ఏమవుతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆప్షన్‌ను వెంటనే ఇవ్వాలని, నిషేధిత జాబితాలోని పట్టా భూములను తొలగించే ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు