రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ ముగిసింది

19 Aug, 2021 03:19 IST|Sakshi

త్వరలో ఇంటింటికీ తిరిగి కరోనా టీకా వేస్తాం  

రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధుల తీవ్రత అధికంగా ఉంది 

జ్వరం వస్తే కరోనా అని భ్రమ పడొద్దు

ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ముగిసిపోయిందని, కానీ థర్డ్‌ వేవ్‌ రాకుండా కోవిడ్‌ మార్గదర్శకాలను పాటించాల్సిందేనని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1.65 కోట్ల మందికి టీకాలిచ్చామన్నారు. 56 శాతం మందికి తొలి డోస్, 34 శాతం మందికి రెండో డోస్‌ పూర్తయిందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 90 శాతం మందికి తొలి డోసు వేయగా, హైదరాబాద్‌లో 100 శాతం సింగిల్‌ డోసు తీసుకున్నట్లు ఆయన బుధవారం మీడియాకు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటింటికీ తిరికి వ్యాక్సిన్‌ ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. పోస్ట్‌ కోవిడ్‌తో ఆస్పత్రుల్లో ఎక్కువమంది ఉన్నారని, లాంగ్‌ టర్మ్‌ కోవిడ్‌ ఎఫెక్ట్‌ కారణంగా మానసిక సమస్యలు పెరుగుతున్నాయన్నారు. అయితే అన్ని జ్వరాలను కరోనాగా భావించవద్దని, జ్వర లక్షణాలు ఉన్నోళ్లంతా వైద్యుడిని సంప్రదించి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, అయితే ఈ వ్యాధులు పెరగకుండా వైద్య,ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోందన్నారు.  

రెండు జిల్లాల్లో అధికంగా డెంగీ కేసులు 
హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు అత్యధికంగా రాగా, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలో మలేరియా కేసులు ఎక్కువగా వచ్చాయని శ్రీనివాసరావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 220, ములుగు జిల్లాలో 120పైగా మలేరియా కేసులు నమోదైనట్లు చెప్పారు. గతేడాది రాష్ట్రంలో 2,173 డెంగీ కేసులు నమోదైతే, ఈ ఏడాది ఇప్పటికే 1,200 నమోదయ్యాయన్నారు. అందులో 448 డెంగీ కేసులు హైదరాబాద్‌లో నమోదయ్యాయన్నారు. దోమలు, లార్వా అభివృద్ధి చెందకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. లార్వాను సూచించే బృటా ఇండెక్స్‌ హైదరాబాద్‌లో 46 శాతం, రంగారెడ్డి జిల్లాలో 39.9 శాతం ఉందన్నారు. అనేక జిల్లాల్లో ఇది 35 శాతం కంటే ఎక్కువగా ఉందని చెప్పారు. ‘ఎవరికైనా జ్వరం, విరేచనాలు, కళ్లు తిరగడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. పెద్ద ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఫీవర్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేశాం. డెంగీ చికిత్స కోసం 24 ప్లేట్‌లెట్‌ ఎలక్ట్రిక్‌ యంత్రాలను సిద్ధంగా ఉంచాం. పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. డెంగీ దోమ పగటి వేళలోనే కుడుతుందని, అందువల్ల ఇళ్లలోకి దోమలు రాకుండా చూసుకోవాలన్నారు. 2025లోపు తెలంగాణను మలేరియారహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు.   

చదవండి: ప్రేయసి కోసం ‘ఆమె’లా మారి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన లవర్‌
చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’

మరిన్ని వార్తలు