ఎజెండాలో కపిరాజు ఎక్కడ?

31 Oct, 2023 09:54 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించాయి. కానీ పల్లె, పట్నం, పేద, ధనిక అన్న తేడా లేకుండా అ న్నిచోట్లా  ఇబ్బందులకు కారణమవుతున్న కోతుల సమస్యను పూర్తిగా పక్కన పెట్టేశాయి. ఏపార్టీ కూడా ఈ సమస్యపై ఇప్పటివరకు మాట్లాడలేదు. 

జనావాసాలపై దాడులు.. 
అడవుల్లో ఉండాల్సిన కోతులు అక్కడ ఆహారం దొరక్క  20 ఏళ్లుగా ఊర్ల బాట పట్టాయి. మొదట్లో అడవుల గుండా వెళ్లే హైవేల పక్కన అడ్డా ఏర్పాటు చేసుకున్నాయి.  వచ్చి పోయేవారు ఇచ్చే ఆహారం కోసం ఎదురుచూశాయి. ఇక అక్కడి నుంచి ఊర్లలోకి వచ్చిన తర్వాత పంట పొలాలు మొద లు ఇంట్లోని కిచెన్‌ వరకు ప్రతీ చోట కోతుల దాడి పెరిగింది.   

కోతులు అడవులకు వెళ్లాలి 
తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపట్టింది. ‘వనాలు పెరగాలి – కోతులు అడవులకు పోవాలి’ అనేది హరితహారం నినాదం. పదేళ్లు గడిచే సరికి తెలంగాణలో స్థూలంగా అడవుల విస్తీర్ణం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ హరితహారం నినాదానికి తగ్గట్టుగా కోతులు అడవులకు పోలే దు సరికదా మరింతగా దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రైతులకు పంట నష్టం జరుగుతోంది.  

కనిపించని ఫుడ్‌కోర్టులు  
రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాల్లో కోతుల కోసం ప్రత్యేకంగా మంకీ ఫుడ్‌ కోర్టులంటూ పండ్ల మొక్కలను ఎంపిక చేసిన స్థలాల్లో నాటారు. కానీ సరైన ఆలనాపాలన లేకపోవడంతో ఇవి నామరూపాల్లేకుండా పోయాయి. 

అసెంబ్లీలో సైతం చర్చ 
తెలంగాణ తొలి శాసనసభలో సీఎం కేసీఆర్‌ స్వయంగా కోతుల కారణంగా గ్రామాల్లో తలెత్తుతున్న ఇబ్బందులను  ప్రస్తావించారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి లాంటి ప్రాంతాల్లో కోతుల కారణంగా కూరగాయల సాగుకు రైతులు దూరమయ్యారని చెప్పారు.  కోతులు బాధ  భయంకరంగా మారిందన్నారు. అడవుల్లో ఫలాలు ఇచ్చే వృక్షాలను పెంచడం తప్ప మరో మార్గం లేదన్నారు.  

పరిహారం మాటేమిటి? 
కోతుల కారణంగా జరుగుతున్న పంట నష్టానికి పరిహారం చెల్లించాలంటూ 2017లో జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో నాటి కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు డిమాండ్‌ చేశారు. అప్పటి అటవీశాఖ మంత్రి జోగురామన్న కోతుల వల్ల ఇబ్బందులేమీ లేవని చెప్పే ప్రయత్నం చేయగా వరంగల్‌కు చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, అప్పటి స్పీకర్‌ మధుసూదనాచారి కోతుల సమస్య తీవ్రంగా ఉందంటూ చర్చలో తమ అభిప్రాయాలు తెలిపారు.

ఆఖరికి కోతులను బెదరగొట్టేందుకు కొండెంగలు (కొండముచ్చులు) అద్దెకు తీసుకురావాలని అప్పటి శాసన సభ్యులు కోరారు. కోతుల నియంత్రణ కోసం రూ. 2.2 కోట్లతో నిర్మల్‌లో ప్రత్యేక సెంటర్‌ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అయితే ఆచరణ అంతంతగానే ఉంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రజలే స్వచ్ఛందంగా చందాలు వేసుకుని కోతులను పట్టుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులను రప్పించుకున్నారు.

మరిన్ని వార్తలు