ఇవాళే సౌభాగ్య‌దాయిని ‘అట్ల‌త‌ద్ది’! ఈ పండుగలో దాగున్న ఆరోగ్య రహస్యం ఏంటంటే..?

31 Oct, 2023 10:08 IST|Sakshi

అట్లతద్ది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. ‘తదియ’ నే ‘తద్దె’ అంటారు. ఉండ్రాళ్ల తద్దె , అట్ల తద్దె అనేవి అలా వచ్చినవే. ఆశ్వయుజ బహుళ తదియనాడు దీనిని జరుపుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ అనీ , గోరింటాకు పండుగ అనీ అంటారు. అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు? దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏమిటీ? తదితరాల గురించే ఈ కథనం!. 

ఈ పండుగకు గోరింటాకు పెట్టుకోవడం చాలా ముఖ్యం
అట్లతద్దె ఈ తద్ది ప్రసిద్దమైనది. ఆంధ్ర ఆడపడుచులకు చాల ముఖ్యమైన పండుగ. అట్లతద్ది ముందురోజు భోగి అని పిలుస్తారు. ఆడపిల్లలందరూ చేతులకు, కాళ్ళకు గోరింటాకు పెట్టుకుని తెల్లవారుఝామునే లేచి ఉట్టి కింద కూర్చుని చద్దన్నం తింటారు(ఇప్పుడు ఉట్లు లేవు లెండి) ఆటపాటలతో కాలక్షేపం చేసి ఉయ్యాలలూగుతారు! పగలంతా ఉపవాసముండి సాయంకాలం చంద్రోదయం అయిన తరువాత చంద్రదర్శనం చేసుకుని 'చంద్రోదయోమా వ్రతం' చేసి అట్లు దానమిచ్చి , ఉమాదేవిని పూజించి భోజనం చేస్తారు. ఈ అట్లతద్దికి గోరింటాకును పెట్టుకోవడం చాల ముఖ్యం!

చర్మ వ్యాధులు రాకూడదని..
గోరింట అంటే గోరు+అంటు= గోరింట అని బ్రౌణ్యం చెపుతోంది. సంస్కృతంలో కూడ దీన్ని నఖరంజని అంటారు. దీన్ని బట్టి చూస్తే గోరింటాకు గోర్లకు మంచిది అని తెలుస్తుంది. ఈ గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి మొగుడొస్తాడని సరసాలడతారు. గ్రీష్మఋతువులోని ఆషాఢమాసంలోనూ వర్షఋతువులోని భాద్రపద మాసంలోనూ శరదృతువులోని ఆశ్వయుజ మాసంలోనూ మూడు సందర్భాలలో గోరింటాకును పెట్టుకుంటారు. ఇవి మూడు వానకారు పబ్బాలుగా ప్రసిద్ది! తెల్లవారుఝాము నుంచీ ఆడపిల్లలు పాడుతూ ఆడుకునే పాటలలో ఎన్నో ఆరోగ్యరహస్యాలను పొందుపరిచారు. ఇళ్ళల్లో నీళ్ళతావుల్లో తిరిగే ఆడవాళ్ళకు చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వాటికి వాడవలసిన మందులను తెలిపే పాట....

'కాళ్ళగజ్జ కంకాళమ్మ
వేగుచుక్క వెలగామొగ్గ
మొగ్గా కాదు మోదుగనీరు
నీరుకాదు నిమ్మలబావి
బావికాదు వావిటికూర
కూరకాదు గుమ్మిడిపండు
పండుకాదు పాపిడిమీసం'

కాళ్ళకు గజ్జి లాంటి చర్మవ్యాధులొస్తే కంకాళమ్మ ఆకును నూరి పసరుతీసి రాస్తే గజ్జి పోతుంది. దానికి లొంగకపోతే వెలగ మొగ్గను నుజ్జుచేసి శరీరంపై పూసుకోవాలి. అప్పటికీ తగ్గకపోతే వావిటికూరను ముద్దగాజేసి పట్టీలు వేసుకోవాలి అప్పుడు ఆ వ్యాధి నిమ్మళించి గుమ్మడి పండులాగ నిగనిగలాడతారని ఈ పాటలో చెప్పారు! అలాగే గోరింటాకు పెట్టుకున్నగోళ్ళు వాటి రంగులు చూసుకుంటూ 'చిప్పచిప్ప గోళ్ళు సింగరాజు గోళ్ళు' అని పాడుకుంటారు.

'ఒప్పులకుప్ప ఒయ్యారిభామా
సన్నబియ్యం ఛాయాపప్పు
మునగాపప్పూ నీమొగుడెవరు
గూట్లోరూపాయి నీమొగుడు సిపాయి'

అని ఈరోజు ఉదయంనుంచి తయారు చేసిన పదార్ధాల మూలాలను తలచుకుంటూ వీర్యవృద్ధి కలిగిన ఈ పిండివంటలన్నీ రాబోయే మొగుడికోసమేనని మేలమాడుతూ రోటిపాటలు పాడతారు.ఆ రోళ్ళకు ఉయ్యాలలు కట్టి ఊయలలూపుతూ పెళ్ళయిన పడుచులను మొగుడిపేరు గట్టిగా చెప్పేదాకా వదలకుండా ఊపుతారు. పెట్టుకున్న గోరింటాకు ఎలా పండిందో చూసుకుని మురిసిపోతూ ...

'గోపాలకృష్ణమ్మ పెళ్ళయ్యేనాడు
గోరింట పూచింది కొమ్మలేకుండా
మాఇంట అబ్బాయి పెళ్ళయ్యేనాడు
మల్లెలు పూచాయి మొగ్గలేకుండా'
ఈ సంప్రదాయ స్త్రీ పాటనే కృష్ణశాస్త్రిగారు తమపాట పల్లవిగా మలచుకున్నారు. తరువాత వారి చరణమే

'మందారంలా పూస్తే మంచిమొగుడొస్తాడు
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు
సిందూరంలా పూస్తే చిట్టిచేయంతా అందాల చందమామ అతనే దిగివస్తాడు'

అనుకుంటూ చంద్రోదయోమావ్రతం చేసుకుంటారు! ఇవన్నీ నిన్నామొన్నటి వరకు పల్లెపడుచుల అట్లతద్ది ఆటపాటలు. బహుశః ఏ పైలోకాలలోనో తెలుగు ఆడపడుచులకు వాళ్ళ చిన్నతనంలోని పాటలన్నీ వినాలనిపించిందేమో ... ఈ పాటల ఊయలలను తీసుకుపోయి అందనంత ఎత్తులో వాళ్ళదగ్గరే ఉంచేసుకున్నారు. కానీ ఊయలెప్పుడూ ఒకేచోట ఉండదు! అది కిందకు రాక తప్పదు!! మళ్ళీ ఈ అట్లతద్ది ఆటపాటలు మాకందివ్వకా తప్పదు!!! ఈ తరం పడుచులందరికీ ఒకటే వినతి! రండి లేవండి తెల్లవారు ఝామునే చద్దన్నం తిని మన ఆటపాటల ఊయలను మనమే పట్టుకుందాం రండి!!

'అట్లతద్దోయ్ ఆరట్లోయ్
ముద్దపప్పోయ్ మూడట్లోయ్
సీమ పచ్చిమిరపకాయ్ చిఱ్ఱో చిఱ్ఱో
నీ మొగుడు కొడితే మొఱ్ఱో మొఱ్ఱో'

అట్లతద్ది అంతరార్థం
త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొంద గోరి మొదటి సారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి వ్రతం చేసిన వారికి వస్తుందని , ఆయన అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని , కుటుంబంలో సుఖశాంతులు వర్థిల్లుతా యని శాస్త్ర వచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం దాగి ఉంది.

నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహా ప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం. రుతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ ఉండవు. మినపపిండి , బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు , బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. బియ్యం , మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించటంలో సమస్త గ్రహాలు కూడా శాంతించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తుందని నమ్మకం. అమ్మవారి నైవేద్యం ఆరోగ్యాన్ని , శక్తిని కలిగిస్తుంది. ఈ పండుగను అవివాహిత స్త్రీలు చేస్తే మంచి మొగుడు వస్తాడని, పెళ్లైన వారు చేస్తే సౌభాగ్యం కలకలం ఉంటుందని శాస్త్ర వచనం.

(చదవండి: కోరికలు కలలోని పూదోటలు! వాటి కోసం పరుగులు తీస్తే చివరికి..)

మరిన్ని వార్తలు