ఆయిల్‌ పామ్‌.. పెట్టుబడుల బూమ్‌

2 Jan, 2022 02:38 IST|Sakshi

ఆయిల్‌ పామ్‌ రంగాన్ని విస్తరించబోతున్న రాష్ట్ర సర్కారు 

రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక 

11 ఆయిల్‌ పామ్‌ కంపెనీలకు జోన్లు కేటాయింపు 

25 క్రషింగ్‌ ఫ్యాక్టరీలు, మరో 25 రిఫైనరీల ఏర్పాటు 

దాదాపు రూ. 4,500 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం 

ప్రత్యక్షంగా, పరోక్షంగా 55 వేల మందికి ఉద్యోగావకాశాలు 

ప్రభుత్వానికి రూ. 400 కోట్లదాకా జీఎస్టీ కూడా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ రంగం విస్తరించబోతోంది. ఇందుకోసం రాష్ట్ర సర్కారు మంచి ప్రణాళికలు వేస్తోంది. దేశంలోనే తొలిసారి భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించే కార్యాచరణతో ముందుకు సాగుతోంది. వచ్చే నాలుగైదేళ్లలో 30 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగును పెంచి ఈ రంగంలో రూ. 3,750 కోట్ల పెట్టుబడులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. సర్కారు చర్యలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 55 వేల మందికి ఉపాధి లభించనుందని ఆయిల్‌ ఫెడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఫ్యాక్టరీలు, నూనె తీత తదితరాలతో ఏడాదికి రూ. 400 కోట్ల జీఎస్టీ ప్రభుత్వానికి సమకూరనుందని అంచనా.  

తొలుత 26 జిల్లాల్లో 9.5 లక్షల ఎకరాల్లో.. 
దేశవ్యాప్తంగా వరి ధాన్యం ఉత్పత్తులు పేరుకుపోవడంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని కొన్నాళ్లుగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది. ఇందులో భాగంగా మంచి లాభాలు పొందే అవకాశమున్న పామాయిల్‌ వైపు రైతులను మళ్లిస్తోంది. మున్ముందు రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టాలని ప్రణాళిక వేసింది. తొలుత 26 జిల్లాల్లో సుమారు 9.49 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించింది. ఇందుకు 11 ఆయిల్‌ పామ్‌ కంపెనీలకు జోన్లను కేటాయించింది. 2022–23 సంవత్సరంలో 5 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగు చేపట్టాలని కంపెనీలను ఆదేశించింది.

ఆయిల్‌ ఫెడ్‌కు 1.80 లక్షల ఎకరాలు, ప్రీ యూనిక్‌ కంపెనీకి లక్ష ఎకరాలు, రుచి సోయాకు 40 వేల ఎకరాలు, ఇతర కంపెనీలకు మిగిలిన భూముల జోన్లను కేటాయించింది. ఆ ప్రకారం కంపెనీలు వచ్చే మూడు, నాలుగేళ్లలో పామాయిల్‌ క్రషింగ్‌ ఫ్యాక్టరీలను నెలకొల్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పామాయిల్‌ నూనె వినియోగం 4 లక్షల టన్నులు కాగా 45 వేల టన్నులే రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. 5 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగు పెంచి ఫ్యాక్టరీలను స్థాపిస్తే రూ. 7,400 కోట్ల విలువైన 7.4 లక్షల టన్నుల పామాయిల్‌ ఉత్పత్తి కానుంది. దిగుమతికి బదులు ఎగమతి చేసే స్థాయికి రాష్ట్రం చేరుకుంటుంది.  

25 క్రషింగ్‌ యూనిట్లు.. 3,750 కోట్ల పెట్టుబడులు 
సర్కారు ప్రణాళికలో భాగంగా కంపెనీలు మొదట 25 క్రషింగ్‌ ఫ్యాక్టరీలను నెలకొల్పాల్సి ఉంటుంది. ఆ ప్రకారం ఒక్కో ఫ్యాక్టరీకి రూ. 150 కోట్ల చొప్పున రూ. 3,750 కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఆ ఫ్యాక్టరీల్లో ప్రత్యక్షంగా 2,500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇక పామాయిల్‌ పంట భూముల్లో ఏకంగా 50 వేల మందికి ఉపాధి లభించనుందని. మరో 2,500 మందికి పామాయిల్‌ రవాణా రంగంలో ఉపాధి దొరుకుతుందని ఆయిల్‌ ఫెడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అలాగే రైతులకు పామాయిల్‌ సాగుతో లక్షలాది రూపాయల ఆదాయం సమకూరనుంది. రాష్ట్రంలో ఓ రైతు 33 ఎకరాల్లో పామాయిల్‌ సాగు చేస్తున్నాడని, అతనికి ఏడాదికి రూ. 45 లక్షల ఆదాయం వస్తోందని ఆయిల్‌ ఫెడ్‌ చెప్పింది. 

రూ. 750 కోట్లతో రిఫైనరీలు 
పామాయిల్‌ క్రషింగ్‌ ఫ్యాక్టరీల్లో క్రూడాయిల్‌ బయటకు తీస్తారు. దాన్ని రిఫైన్‌ చేసి పామాయిల్‌ వంట నూనె తయారు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి క్రషింగ్‌ ఫ్యాక్టరీ వద్ద ఒక్కో రిఫైనరీ ఫ్యాక్టరీని నెలకొల్పాలి. ఒక్కో రిఫైనరీ ఫ్యాక్టరీ కోసం రూ. 30 కోట్ల చొప్పున రూ. 750 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,500 మందికి ఉద్యోగ ఉపాధి లభించనుంది. 

అటు పెట్టుబడులు.. ఇటు ఉద్యోగాలు 
పామాయిల్‌ రంగంలో క్రషింగ్‌ ఫ్యాక్టరీల వల్ల వచ్చే మూడేళ్లలో రూ. 3,500 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఇందులో ఆయిల్‌ఫెడ్‌ ద్వారానే రూ. 750 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టబోతున్నాం. దీంతో ఆయిల్‌ఫెడ్‌లోనూ ప్రభుత్వ ఉద్యోగాలు భారీగా భర్తీ కానున్నాయి.  
– సురేందర్, ఎండీ, ఆయిల్‌ఫెడ్‌ 

మరిన్ని వార్తలు