ఇంటర్‌ అఫిలియేషన్‌ ప్రక్రియ ప్రారంభం­

24 Jan, 2023 00:54 IST|Sakshi

షెడ్యూల్‌ ప్రకటించిన బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌

రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఏప్రిల్‌లోగా గుర్తింపు జాబితా

సాక్షి, హైదరాబాద్‌: అఫిలియేషన్‌ వ్యవహా­రంలో వివాదాలకు తెరదించేందుకు ఇంటర్మీడియెట్‌ బోర్డు ఉపక్రమించింది. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధిచిన అను­బంధ గుర్తింపు ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌­ను బోర్డ్‌ సోమవారం విడుదల చేసింది. గతంలో పరీక్ష ఫీజు చెల్లించే తేదీ సమీపి­స్తున్నా.. అఫిలియేషన్‌ వ్యవహారం కొలిక్కి­రాక గుర్తింపు రాని కాలేజీల్లోని విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం లేకుండా పోయేది.

దీంతో ఇలాంటి వివాదాలకు పుల్‌స్టాప్‌ పెడుతూ వచ్చే ఏడాది కాలేజీలు మొదలయ్యే నాటికే అఫిలియేషన్ల ప్రక్రియ ముగించాలని బోర్డు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 2023–24 విద్యాసంవత్సరానికి కళాశాలల అనుబంధ గుర్తింపు నోటిఫికేషన్‌ను బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ విడుదల చేశారు. అలాగే, ఏప్రిల్‌ 30లోపే అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ప్రకటించాలని బోర్డు గడువుగా పెట్టుకుంది. 

ఆలస్యం లేకుండా ముందే...
రాష్ట్రంలోని ఇంటర్‌ కాలేజీలు బోర్డు అనుబంధ గుర్తింపును పొందిన తర్వాతే నడపాల్సి ఉంటుంది. కొత్త కాలేజీల ఏర్పాటుకు అవకాశం లేకపోగా, నడుస్తున్న కాలేజీలు, వీటిల్లో అదనపు సెక్షన్లకు ఏటా అనుబంధ గుర్తింపును పునరుద్ధరిస్తుంటారు. అయితే కొంతకాలంగా అను­మతుల జారీ ప్రక్రి­య ఆలస్య­మవు­తోంది. ఇదంతా జూన్‌ కంటే ముందుగానే ముగియా­ల్సి ఉండగా, సెప్టెంబర్‌ వరకు కొనసాగుతోంది.

అనుబంధ గుర్తింపు పొందకుండానే కాలేజీలు అడ్మి­షన్లు తీసుకుని విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. దీంతో ఏటా గందరగోళానికి దారి తీస్తోంది. ఈ సంవత్సరం మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీ కారణంగా డిసెంబర్‌ వరకు అఫిలియేషన్ల జారీ కొనసాగింది. ఈ నేపథ్యంలో బోర్డు ఈసారి ముందుగానే అనుమతుల షెడ్యూల్‌ ప్రకటించింది. అనుబంధ గుర్తింపు కోసం కాలేజీ యాజమాన్యాలు ఆలస్య రుసుము లేకుండా ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని నవీన్‌­మిత్తల్‌ వెల్లడించారు. ఆలస్య రుసుముతో మార్చి 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు.

అఫిలియేషన్‌కూ జీఎస్‌టీ
ప్రైవేటు కాలేజీల అనుబంధ గుర్తింపునకూ ఇకపై జీఎస్‌టీ చెల్లించాలి. తాజాగా ఇంటర్‌ బోర్డు విడుదల చేసిన అఫిలియేషన్‌ నోటిఫికేషన్‌లో ఈ అంశాన్ని కొత్తగా చేర్చారు. మున్సిపల్‌ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే కళాశాలలకు వేర్వేరు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇవి రూ. 21 వేల నుంచి రూ. 65 వేల వరకూ ఉంటాయి. ఈ మొత్తానికి 18 శాతం జీఎస్‌టీ చెల్లించాలని పేర్కొన్నారు. అఫిలియేషన్‌ పొందే కాలేజీలు కూడా సేవల పరిధిలోకి వస్తాయని బోర్డు పేర్కొనడం గమనార్హం.

మరిన్ని వార్తలు