బీజేపీ అంటే బిగ్‌ జోకర్స్‌ పార్టీ

23 Aug, 2021 01:26 IST|Sakshi

ఎంపీ అరవింద్‌ బిగ్‌ లోఫర్‌: జీవన్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అంటే బిగ్‌ జోకర్స్‌ పార్టీ అని అందులో బిగ్‌ లోఫర్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అని ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌ (పీఏసీ) జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నిజామాబాద్‌కు పసుపు బోర్డు తెస్తానని నకిలీ హామీపత్రం రాసిచ్చిన ఎంపీ అరవింద్‌ అని అలాంటి వ్యక్తికి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవితల గురించి మాట్లాడే స్థాయి ఉందా అని ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు ఈనెల 16న హుజూరాబాద్‌లో జరిగిన దళిత బంధు సభ గురించి అరవింద్‌ ఇప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అవినీతికి అండగా నిలిచే పార్టీలు కాం గ్రెస్, బీజేపీలేనని జైలుకు పోయిన రేవంత్‌రెడ్డి కూడా అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన విరుచుకుపడ్డారు. మాటి మాటికి సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపుతామనే ప్రగల్భాలను బీజేపీ నేతలు బంద్‌ చేయాలని హెచ్చరించారు. బీజేపీ నేతలు ఎన్ని పాదయాత్రలు చేసినా, మోకాళ్ళ మీద నడిచినా రాష్ట్రంలో ఆ పార్టీకి అధికారం కలేనన్నారు. 

మరిన్ని వార్తలు