స్థానికులకు ఉద్యోగాలిస్తే మరిన్ని ప్రోత్సాహకాలు

18 Dec, 2021 01:36 IST|Sakshi
రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్‌ 

కోటెలిజెంట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌

అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలిచ్చే అవకాశం ఉండదు

కొత్త పరిశ్రమలను ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పించాలి

మేం ఇదే పని చేస్తున్నాం.. యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాలి  

హఫీజ్‌పేట్‌: రాష్ట్రంలో స్థానికులకు ఉద్యోగావకాశాలు అందించే పరిశ్రమలు, సంస్థలకు రానున్న రోజుల్లో మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు హామీ ఇచ్చారు. ఐటీ సహా వివిధ వ్యాపార సంస్థలకు సైబర్‌ భద్రతా ఉత్పత్తులు, సేవలు అందించే కోటెలిజెంట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టెక్‌డెమోక్రసీ అనుబంధ సంస్థ) శుక్రవారం హైదరాబాద్‌ రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలోని స్కైవ్యూలో సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీవోఈ)ను ఏర్పాటు చేసింది.

ఈ కేంద్రాన్ని కోటెలిజెంట్‌ ప్రతినిధులు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌తో కలసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 136 కోట్లకుపైగా ఉన్న దేశ జనాభాలో 50% మంది 27 ఏళ్ల కంటే తక్కువ వయసు వారేనన్నారు. అయితే అందరి కీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే అవకాశం ప్రభుత్వాలకు ఉండదన్నారు. అందుకే కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పించాలని...  ప్రభుత్వం అదే చేస్తోందని కేటీఆర్‌ తెలిపారు.  

నైపుణ్యం ఉంటే ఆటోమేటిక్‌గా ఉద్యోగాలు... 
హైదరాబాద్‌కు భారీగా పరిశ్రమలు వస్తున్నా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదంటూ పలువురు సోషల్‌ మీడియాలో పేర్కొంటున్న విషయాన్ని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రతిభగల వారు, ఫైర్‌ ఉన్న యువత రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే ఆటోమెటిక్‌గా ఉద్యోగాలు వస్తాయన్నారు.

ప్రతిభగల వారిని కంపెనీలు తీసుకుంటాయని, స్థానికులకు కూడా ప్రతిభ ఉంటే ఉద్యోగాలు సంపాదించవచ్చన్నారు. కోటెలిజెంట్‌ సంస్థ ద్వారా వందలాది మందికి ఉదోగ్యాలు కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.  

వ్యవసాయ కుటుంబం నుంచి ఎదగడం 
కోటెలిజెంట్‌ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీకిరణ్‌ పాటిబండ్లను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. వరంగల్‌ జిల్లా గోవిందరావుపేట మండలంలోని ఓ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన ఆమెరికాలో ఉన్నత చదువులు పూర్తిచేసి హైదరాబాద్‌లో కోటెలిజెంట్‌ సంస్థను ఏర్పాటు చేసి వందలాది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగడం సంతోషకరమన్నారు. 

సైబర్‌క్రైంపై చట్టం తెస్తున్నాం..
పౌరులు, సంస్థల డేటా భద్రంగా ఉండాలంటే సైబర్‌ సెక్యూరిటీ ఉండాల్సిందేనని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. దేశంలో సైబర్‌క్రైం పెరుగుతోందని... ప్రధాని ట్విట్టర్‌ ఖాతా కూడా తాజాగా హ్యాకింగ్‌కు గురైందని ఆయన గుర్తుచేశారు. భవిష్యత్తులో సైబర్‌ యుద్ధాలే జరుగుతాయన్నారు. ఈ నేపథ్యంలో కోటెలిజెంట్‌ సంస్థ సైబర్‌ వారియర్‌ అనే ప్రాజెక్టును కూడా ఏకకాలంలో ప్రారంభించడం మంచి విషయమన్నారు. నల్సార్‌ యూనివర్సిటీ సహకారంతో సైబర్‌ క్రైం కట్టడికి చట్టం తేవాలనుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

ఈ తరహా చట్టాన్ని తీసుకురానున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుందని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని కోటెలిజెంట్‌ ప్రతినిధులను కోరారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి మంది సైబర్‌ వారియర్స్‌ను తయారు చేయడానికి సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) మంత్రి కేటీఆర్‌ సమక్షంలో కోటెలిజెంట్‌ సంస్థ ఇచ్చిపుచ్చుకుంది.

మరిన్ని వార్తలు