‘మానాల’ మళ్లీ పురుడు?

11 Apr, 2022 03:17 IST|Sakshi

నిజామాబాద్‌లో నిలదొక్కుకునేందుకు మావోయిస్టు పార్టీ  యత్నాలు

సిరిసిల్ల, జగిత్యాలలో జవసత్వాల కోసం జనశక్తి ఆరాటం

పార్టీ పునర్నిర్మాణం కోసం నియామకాలపై మావోయిస్టుల దృష్టి

మూడు జిల్లాల పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైనం

సాక్షి, హైదరాబాద్‌: సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఆ ప్రాంతంలో 16 మందిని పోలీస్‌ ఇన్‌ఫార్మర్ల నెపంతో పీపుల్స్‌ వార్‌ ఊచకోత కోసింది. ఆ తర్వాత నాలుగేళ్లకు ఆ ప్రాంతానికి సమీపంలో 11 మంది పీపుల్స్‌ వార్‌ సభ్యులు పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. ఇప్పుడదే ప్రాంతంలో మానాలలో మళ్లీ పురుడుపోసుకునేందుకు నాటి పీపుల్స్‌వార్‌.. నేడు మావోయిస్టు పార్టీ.. తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్న వార్త సంచలనం రేపుతోంది.

రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సిరిసిల్ల, నిజామాబాద్‌ జిల్లాల్లో కొత్త రక్తం కోసం ప్రయత్నాలు చేస్తున్న ముగ్గురు సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్‌ చేయడం కలవరానికి గురిచేస్తోంది. అయితే ఒకవైపు ఈ రెండు జిల్లాల్లో మావోయిస్టు పార్టీ నియామకాలపై దృష్టి సారిస్తుంటే.. మరోవైపు జనశక్తి కూడా కార్యకలాపాలను విస్తృతంచేస్తోంది. బెదిరింపులు, వసూళ్లకు పాల్పడుతూ అటు వ్యాపారులను, ఇటు పోలీసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.  

నలుగురు వెళ్లారు.. ఇద్దరు వచ్చారు.. 
నిజామాబాద్‌కు చెందిన ఇద్దరు, సిరిసిల్లకు చెందిన ఇద్దరు.. పట్టభద్రులు ఆరు నెలల క్రితం మావోయిస్టులో చేరేందుకు వెళ్లారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు వాళ్ల వ్యక్తిగత కక్షలను తీర్చుకునేందుకే వెళ్లడంతో వారిని పార్టీ వెళ్లిపోవాలని సూచించగా తిరిగి వెనక్కు వచ్చినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. మిగిలిన ఇద్దరు ఆ పార్టీ సిద్ధాంతాలతో ఇమడలేక ఇబ్బంది పడుతున్నారని, వారు కూడా త్వరలోనే తిరిగివస్తారని పేర్కొన్నాయి.

ఈ నలుగురిని సానుభూతిపరులుగా మార్చడంలో క్రియాశీల పాత్ర పోషించింది మూడు రోజుల క్రితం నిజామాబాద్‌ జిల్లా పోలీసులు అరెస్టు చేసిన బుస జనార్ధన్, గంగాధర్, కమల్‌తో పాటు అండర్‌గ్రౌండ్‌లో ఉన్న మరో ఇద్దరు అని స్పష్టంచేశాయి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి ఇస్రోజివాడకు చెందిన లోకేటీ చందర్‌ అలియాస్‌ స్వామి ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో దండకారుణ్య జోనల్‌ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.

ఇతడి సంప్రదింపులతో అరెస్టయిన ముగ్గురు తెలంగాణ మావోయిస్టు కమిటీలో కీలక సభ్యుడు ఆజాద్‌ను కలిసినట్టు పోలీస్‌ వర్గాలు తెలిపాయి. ఆజాద్‌ ఆదేశంతోనే ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న యువతను పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నించినట్టు వెల్లడించాయి. ఇలా ఉమ్మడి నిజామాబాద్, సిరిసిల్ల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని నియామకాలు చేస్తున్నట్లు తెలిసింది.  

వసూళ్లలో జనశక్తి బిజీ... 
సిరిసిల్ల, వేములవాడ, కామారెడ్డి, జగిత్యాల.. ఈ ప్రాంతాల్లో నిషేధిత సంస్థ జనశక్తి ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. సిరిసిల్లకు చెందిన కూర రాజన్న అగ్రనాయకత్వంగా పనిచేసిన ఈ సంస్థ మళ్లీ జవసత్వాల కోసం ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. అండర్‌గ్రౌండ్‌లో ఉంటూ జనశక్తికి ఊపిరిపోయాలని భావిస్తున్న రాజన్న పాత అనుచరులతో మళ్లీ దందాలకు తెరలేపినట్లు పోలీసులు వెల్లడించారు.

రెండు రోజుల క్రితం వేములవాడకు చెందిన వంగాల రాజమల్లయ్యని కొందరు హతమార్చేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయారు. వీరిలో పోహునుక సురేష్‌ అలియాస్‌ మల్యాల సురేష్‌ అలియాస్‌ పీఎస్‌పీ రెడ్డి, చిట్టీ రాజేశ్వర్, నగురూరి రవీందర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జనశక్తి పేరు చెప్పి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను, భవన నిర్మాణ వ్యాపారులను, పెట్రోల్‌ బంక్‌ యజమానులను, చోటామోటా నేతలను..  బెదిరించి డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా జనశక్తిని విస్తరించే ప్రయత్నం చేస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి వారందరికీ తుపాకులు అందిస్తోంది.. కార్యచరణ, కార్యాకలాపాల విస్తరణ ఐడియా మొత్తం రాజన్నదే అని పోలీసులు స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు