Telangana: పోలీసులకు తీపికబురు 

9 Jun, 2021 11:06 IST|Sakshi

స్థలం కొనుగోలు, గృహనిర్మాణాలకు రుణ పరిమితి పెంపు

పిల్లల విదేశీ విద్యారుణాలనూ పెంచుతూ డీజీపీ నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు సిబ్బందికి డీజీపీ మహేందర్‌రెడ్డి తీపి కబురు అందించారు. కానిస్టేబుల్‌ నుంచి ఐపీఎస్‌ అధికారి వరకు అందరికీ ఇంటి రుణపరిమితిని పెంచుతూ, అదే సమయంలో రుణాల వడ్డీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం డీజీపీ ఆధ్వర్యంలో జరిగిన భద్రత– ఆరోగ్య భద్రత ట్రస్ట్‌ బోర్డు మీటింగ్‌లో.. ప్లాటు కొనుగోలు వడ్డీరేటును 7.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించారు. పిల్లల విదేశీ విద్యా రుణాలను అన్ని హోదాల్లోని వారికి రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. ఈ సందర్భంగా డీజీపీకి తెలంగాణ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 

ఇల్లు కట్టుకునేందుకు లోన్లు ఇలా... 
కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సై స్థాయి దాకా రూ. 35 లక్షల నుంచి 40 లక్షలు, ఎస్సై నుంచి సీఐ వరకు రూ. 45 లక్షల నుంచి 50 లక్షలు, డీఎస్పీ నుంచి ఏఎస్పీ వరకు రూ.55 లక్షల నుంచి 60 లక్షలు, ఐపీఎస్‌లకు రూ.65 లక్షల నుంచి రూ.70 లక్షలకు రుణ పరిమితి పెంచారు. 

ప్లాటు కొనుగోలుకు రుణం పెంపు 
కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సై వరకు రూ. 20 లక్షల నుంచి 25 లక్షలు, ఎస్సై నుంచి సీఐ వరకు రూ. 25 లక్షల నుంచి రూ.30 లక్షలు, డీఎస్పీ నుంచి ఏఎస్పీ వరకు రూ.30 నుంచి రూ.35 లక్షలు, ఐపీఎస్‌లకు రూ.40 లక్షల నుంచి 45 లక్షలకు రుణ పరిమితిని పెంచారు.   

చదవండి: Telangana: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త

>
మరిన్ని వార్తలు