రాష్ట్ర వృద్ధుల్లో 31.6 శాతం మందికి ఆరోగ్య బీమా 

29 Oct, 2023 05:15 IST|Sakshi

జాతీయ స్థాయిలో 11వ స్థానంలో తెలంగాణ 

రాష్ట్రంలో 2036 నాటికి 17.1 శాతానికి పెరగనున్న వృద్ధుల జనాభా 

ఇండియా ఏజింగ్‌ రిపోర్ట్‌–2023 వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: వృద్ధుల ఆరోగ్య బీమా పథకాల కవరేజీ తెలంగాణలో 31.6 శాతంగా ఉంది. ఈ విషయంలో మన రాష్ట్రం దేశంలో 11వ స్థానంలో ఉంది. జాతీయ సగటు 18.2 శాతం కంటే తెలంగాణ మెరుగ్గా ఉండటం గమనార్హం. మిజోరంలో దేశంలోనే అత్యధికంగా 66.5 శాతం మంది వృద్ధులకు ఆరోగ్య బీమా కవరేజీ ఉండగా అతితక్కువగా జమ్మూకశ్మీర్‌లో 0.2 శాతం మందికే ఉంది.

ఈ మేరకు ఇండియా ఏజింగ్‌ రిపోర్ట్‌–2023 నివేదిక వెల్లడించింది. దీన్ని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ రూపొందించగా కేంద్ర సామాజిక, సాధికారత శాఖ తాజాగా విడుదల చేసింది. మిజోరం, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మేఘాలయా, అస్సాం, గోవా, రాజస్తాన్‌ ఆరోగ్య బీమా పథకాలకు ఎక్కువ కవరేజీని కలిగి ఉన్న రాష్ట్రాలు.

ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో 68.4 శాతం వృద్ధులకు ఆరోగ్య బీమా సౌకర్యాలు అందడంలేదు. దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్ని రకాల ఆరోగ్య బీమాలు, ప్రైవేటు ఆరోగ్య బీమాలను కలిపి సర్వే చేశారు. దేశంలో 55 శాతం వృద్ధుల్లో ఆరోగ్య బీమాలపై అవగాహన లేదు. తెలంగాణలో రెండు అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక జబ్బులున్నవారు 30.7 శాతం మంది ఉన్నారు. 

నివేదికలోని ముఖ్యాంశాలు... 

  • దేశ జనాభాలో 60 ఏళ్లు పైబడిన వారు 10 శాతం ఉండగా 2036 నాటికి వారి సంఖ్య 14.9 శాతానికి పెరుగుతుందని అంచనా. 
  • తెలంగాణలో 2021లో 11 శాతం వృద్ధులు ఉండగా 2036 నాటికి వారి సంఖ్య 17.1 శాతానికి పెరుగుతుంది. 
  • 60 ఏళ్లకు పైబడినవారిలో జీవన ఆయుర్ధా యం 2015–19 మధ్య రాష్ట్ర మహిళల్లో 18.3 శాతం, పురుషుల్లో 17.3 శాతం. 
  • 75 ఏళ్ల తర్వాత తెలంగాణలో సగటున అదనంగా 8.7 ఏళ్లు జీవిస్తున్నారు. 
  • తెలంగాణలో 60 ఏళ్లు పైబడినవారిలో పనిచేయలేని స్థితిలో ఉన్నవారు 14.6 శాతం మంది. ఇండియాలో 23.8 శాతం ఉన్నారు. 
  • 60 ఏళ్లు పైబడినవారిలో పేదరికంలో ఉన్నవారు తెలంగాణలో 15.8 శాతం, ఇండియా 21.7 శాతం ఉన్నారు. 
  • 60 ఏళ్లు పైబడినవారిలో ఎలాంటి ఆదాయం లేనివారు తెలంగాణలో 11 శాతం ఉన్నారు. ఇండియా 18.7 శాతం ఉన్నారు. 

అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లోనే వృద్ధులు ఎక్కువ 
అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. అలాగే ఎక్కువ కాలం బతుకుతున్నారు. వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉండటం, అక్షరాస్యత ఎక్కువగా ఉండటం వల్ల ఇది సాధ్యమైంది. – డాక్టర్‌ కిరణ్‌ మాదల, ఐఎంఏ సైంటిఫిక్‌ కనీ్వనర్, తెలంగాణ 

మరిన్ని వార్తలు