ఓ నలుగురికి భోజనం.. ఆ తర్వాతే మనం

14 Oct, 2022 02:48 IST|Sakshi
అన్నార్తుల ఆకలి తీరుస్తూ.. 

ప్రతి నిత్యం హైవేపై అన్నార్తుల ఆకలి తీరుస్తున్న ఓ పోలీసాయన

ఎస్సై కోనారెడ్డి ఔదార్యం 

సాక్షి, కామారెడ్డి: జీవితంలో నలుగురు మనుషులను సంపాదించుకుంటే చాలనేది పెద్దల మాట. మరి ఆ మాటనే ఒంట పట్టించుకున్నాడో  ఏమో కానీ ఈ పోలీసాయనకి మాత్రం నిత్యం నలుగురుకి కడుపునిండా అన్నం పెట్టనిదే గానీ పొద్దు గడవదు. తానే స్వయంగా వండి నలుగురు పేదలకు వడ్డించిన తర్వాతే కానీ భోజనం చేయడు. కామారెడ్డి జిల్లా పోలీస్‌ శాఖలో సబ్‌ ఇస్పెక్టర్‌ గా పని చేస్తున్న బి. కోనారెడ్డి 44వ నంబరు జాతీయ రహదారిపై పెట్రోలింగ్‌ నిర్వహించే బృందానికి అధికారిగా రెండేళ్ళుగా విధులు నిర్వహిస్తున్నారు.

హైవే మీద సుదూరప్రాంతాలకు కాలినడకన వెళ్లే పేదలను చూసి చలించిపోయిన ఆయన తనకు చేతనైనంతగా.. ప్రతిని«త్యం నలుగురికి కడుపునిండా భోజనం పెడుతున్నారు. తనకు డ్యూటీ లేని రోజున కూడా అలవాటును మానుకోకుండా పట్టణంలోని సీఎస్‌ఐ గ్రౌండ్‌ సమీపంలోని పేదలకు భోజనం పెడతారు. మానసిక వికలాంగులకైతే తానే అన్నం కలిపి ఇస్తాడు. తన వద్ద స్నేహితులు, బంధువుల దగ్గర వృథాగా ఉన్న దుస్తులను కూడా తీసుకుని పేదలకు అందిస్తుంటాడు. సాటి మనిషి ఆకలి తీర్చే అవకాశం, అదృష్టం మనుషులకే ఉందని, ఇది ఎంతో నాకు తృప్తినిస్తోందని సాక్షి వద్ద ఆనందం వ్యక్తం చేశారు. కాగా ఎస్సై కోనారెడ్డి ఔదార్యంపై ఉన్నతాధికారుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

మరిన్ని వార్తలు