కమ్యూనిస్టులతో ‘కారు’ జర్నీ

12 Nov, 2022 03:11 IST|Sakshi

ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు టీఆర్‌ఎస్‌ స్నేహ హస్తం 

మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎంతో దోస్తీ 

జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌కు కమ్యూనిస్టుల చేదోడు 

2023 ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు ఆరాటం 

ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్‌లోని సీట్లపై కన్ను 

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికలో కామ్రేడ్లు ‘కారు’తో కలిసి ప్రయాణించిన నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారితో జట్టు కట్టాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పేరిట దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని భావిస్తున్న పార్టీ అధినేత కేసీఆర్‌ సీపీఐ, సీపీఎం మద్దతు తీసుకోవాలని భావిస్తున్నారు.

కాంగ్రెస్‌ మినహా భావసారూప్య పార్టీలతో కలిసి పనిచేస్తామని ప్రకటించిన కేసీఆర్‌ కమ్యూనిస్టులతో కలిసి సాగే దిశగా ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారు. తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష, రాజ్యాంగ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్న వైనం తదితరాలపై భవిష్యత్తులో టీఆర్‌ఎస్‌ సాగించే పోరాటంలోనూ వామపక్షాలను భాగస్వామ్యం చేసే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం.

వచ్చే నెల్లో ఢిల్లీ వేదికగా జరిగే బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభకు కేసీఆర్‌ కమ్యూనిస్టు పార్టీల జాతీయ నేతలను ఆహ్వానించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇటు తెలంగాణతోపాటు జాతీయస్థాయిలోనూ కలిసి నడిచేందుకు కేసీఆర్‌ చేసిన ప్రతిపాదనకు ఇరు పార్టీల నేతలు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. 

తెలంగాణ ఏర్పాటు తర్వాత.. 
పార్టీ ఆవిర్భావం తర్వాత 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన టీఆర్‌­ఎస్‌.. 2009 ఎన్నికల్లో టీడీపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి బరిలోకి దిగింది. అయితే తెలం­గా­­ణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన 2014, 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఒంట­రిగా పోటీచేసి సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పా­టు చేసింది.

అయితే కమ్యూనిస్టులకు గణనీయమై­న ఓటు బ్యాంకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ కేవలం ఒక్క స్థానంలోనే విజయం సా­ధిం­చింది. ప్రస్తుతం ఉభయ కమ్యూనిస్టులతో ­మై­త్రీ కుదిరిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ­ఎన్నికల్లో పొత్తులో భాగంగా కొన్ని స్థానా­లు ఆ పార్టీలకు కేటాయించే అవకాశముందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి.

తమకు గణనీయ ఓటు బ్యాంకున్న ఉమ్మ­డి ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్‌ జిల్లా­ల్లో కమ్యూనిస్టులు ఆరు నుంచి పది స్థానాలు కోరే అవకాశమున్నట్లు సమాచారం. సంఘటిత, అసంఘటి­త రంగాల్లోని కార్మికులతో ఉభయ కమ్యూ­నిస్టు పా­ర్టీల అనుబంధ సంఘాలకు పట్టు ఉండటం కొంతమేర కలిసి వస్తుందని టీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది.

కమ్యూనిస్టులు కోరే స్థానాలివే..
సీపీఎం, సీపీఐలతో కలిసి నడిచేందుకు సిద్ధమని ఇప్పటికే టీఆర్‌ఎస్‌ సంకేతాలివ్వడంతో 2023 ఎన్నికల్లో తమకు కేటాయించే స్థానాలపై త్వరలో స్పష్టత కోరే అవకాశమున్నట్లు తెలిసింది. పదేళ్లు­గా అసెంబ్లీలో రెండు పార్టీలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని సీపీఐ, సీపీఎం కృతనిశ్చయంతో ఉన్నాయి.

రాష్ట్రంలో పార్టీ మనుగడకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం తప్పనిసరి అని రెండు పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎం మధిర, పాలేరు, భద్రాచలం, మిర్యాలగూడ లేదా హుజూర్‌నగర్‌ను.. మునుగోడు, హుస్నాబాద్, కొత్తగూడెంతోపాటు మరికొన్ని స్థానాలను సీపీఐ కోరే అవకాశముంది. కొత్తగూడెం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పాలేరు నుంచి సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మిర్యాలగూడ లేదా హుజూర్‌నగర్‌ నుంచి సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, హుస్నాబాద్‌ నుంచి సీపీఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.   

మరిన్ని వార్తలు