కృష్ణాలో ఏపీకి మిగిలింది 11.52 టీఎంసీలే.. 

10 Mar, 2021 02:43 IST|Sakshi

అంతకుమించి వాడకుండా నియంత్రించండి

కృష్ణాబోర్డుకు తెలంగాణ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఏపీ ప్రభుత్వం వినియోగించుకున్న జలాలు పోను మిగిలిన నీళ్లు 11.52 టీఎంసీలేనని.. అంతకుమించి వాడు కోకుండా ఆ రాష్ట్రాన్ని నియంత్రించాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ విన్నవించింది. ఈ మేరకు బోర్డుకు లేఖ రాసింది. ఈ నీటి సంవత్సరంలో కృష్ణా బేసిన్‌లో లభ్యతగా ఉన్న 914.5 టీఎంసీల్లో 66:34 నిష్పత్తిలో ఏపీ వాటా 603.27, తెలంగాణ వాటా 310.77 టీఎంసీలని.. ఇందులో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 553.28, తెలంగాణ 187.09 టీఎంసీలు వినియోగించుకున్నాయని వివరించింది.

కృష్ణా బేసిన్‌లో చిన్న, మధ్య, భారీ తరహా ప్రాజెక్టుల్లో ఏపీలో 38.46 టీఎంసీలు, తెలంగాణలో 10.90 టీఎంసీలు నిల్వ ఉన్నాయని పేర్కొంది. ఇప్పటిదాకా వినియోగించుకున్న జలాలు, ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న నీటిని కలిపితే ఏపీ 591.75 టీఎంసీలు, తెలంగాణ 198 టీఎంసీలను వాడుకుందని వివరించింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే శ్రీశైలం, సాగర్‌లలో నిల్వ ఉన్న నీటిలో ఏపీ కోటా 11.52 టీఎంసీలు.. తెలంగాణ కోటా 112.77 టీఎంసీలని లేఖలో పేర్కొంది. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి 11.52 టీఎంసీలకు మించి వాడుకోకుండా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కృష్ణా బోర్డును కోరింది. 

మరిన్ని వార్తలు