ఆ భూములకు మార్కెట్‌ ధర నిర్ణయించండి 

29 Aug, 2023 04:15 IST|Sakshi

సర్కార్‌కు హైకోర్టు ఆదేశం 

కమ్మ, వెలమ సంఘాలకు భూకేటాయింపు కేసు

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని హైటెక్‌ సిటీ ప్రాంతంలో కమ్మ, వెలమ కుల సంఘాలకు కేటాయించిన భూములకు మార్కెట్‌ విలువను నిర్ణయించాలని సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. జీవో 571 ప్రకారం మార్కెట్‌ ధరను అంచనా వేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించాలని ఆదేశించింది.

ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్న గత ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే నిర్మాణాలు చేసి ఉంటే అవి తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఖానామెట్‌లో కమ్మ, వెలమ కుల సంఘాల కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదెకరాల చొప్పున కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ రిటైర్డు ప్రొఫెసర్‌ ఎ.వినాయక్‌రెడ్డి పిల్‌ దాఖలు చేశారు.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ధర్మాసనం మరోసారి సోమవారం విచారణ చేపట్టింది. అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. కుల సంఘాలకు భూకేటాయింపు అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. 2012, సెప్టెంబర్‌ 14 నాటి జీవో 571 మేరకు ప్రభుత్వం ఈ సంఘాలకు ఇచ్చిన భూములకు మార్కెట్‌ విలువను నిర్ణయిస్తామని, ఇందుకు అనుమతించాలని కోరారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ వినతిని ఆమోదించవద్దని కోరారు. అనంతరం ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు