తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు

30 Jun, 2021 01:26 IST|Sakshi

వచ్చే విద్యా సంవత్సరంలో 4, 9 తరగతుల్లో అమలు 

ఉత్తర్వులు జారీచేసిన ఎస్‌సీఈఆర్‌టీ   

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అన్ని యాజమాన్యాలకు చెందిన విద్యా సంస్థల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేసిన ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరంలో (2021–22) 4, 9 తరగతుల్లో అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌సీ, ఇంటర్నేషనల్‌ బోర్డుల పరిధిలోని అన్ని మీడియం స్కూళ్లలో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని అందులో స్పష్టం చేసింది.

2018–19లో ప్రాథమిక స్థాయిలో ఒకటో తరగతిలో, సెకండరీ స్థాయిలో 6వ తరగతిలో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా ప్రవేశ పెట్టినట్లు పేర్కొంది. 2019–20 విద్యా సంవత్సరంలో 2, 7 తరగతుల్లో, 2020–21 విద్యాసంవత్సరంలో 3, 8 తరగతుల్లో అమలు చేసినట్లు వివరించింది. ఇక 2021–22లో 4, 9 తరగతులు, 2022–23 విద్యా సంవత్సరంలో 5, 10 తరగతుల్లో అమలు చేయనున్నట్లు వెల్లడించింది. త్రిభాషా సూత్రం ప్రకారం అన్ని యాజమాన్యా ల్లోని స్కూళ్లలో 8వ తరగతి వరకు మూడు భాషలను అమలు చేస్తున్నామని, 9వ తరగతి నుంచి 2 భాషలనే అమలు చేస్తున్నామని పేర్కొంది. ఆయా తరగతులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను సిద్ధం చేసినట్లు వెల్లడించింది. దీనిని అమలు చేయని పాఠశాలలపై కఠిన చర్యలు చేపడతామని ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ రాధారెడ్డి పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు