టెక్స్‌టైల్‌ పార్క్‌ మూసివేత

2 May, 2022 01:02 IST|Sakshi

సిరిసిల్లలో ఆధునిక మర మగ్గాలపై నిలిచిన వస్త్రోత్పత్తి

పరిశ్రమ నిరవధిక బంద్‌

పని లేక రోడ్డునపడిన కార్మికులు

అందని విద్యుత్‌ రాయితీ.. సమకూరని వసతులు

కేటీఆర్‌ ఆదుకోవాలని వినతి

సిరిసిల్ల: కార్మికుల దినోత్సవం రోజునే టెక్స్‌టైల్‌ పార్కు మూతపడింది. మరమగ్గాలపై నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే తొలిసారిగా సిరిసిల్లలో ఏర్పాటైన టెక్స్‌టైల్‌ పార్క్‌ లో పరిశ్రమల యజమానులు వస్త్రోత్పత్తి యూని ట్లను ఆదివారం మూసివేశారు. ఇప్పటికే టెక్స్‌టైల్‌ పార్క్‌లో వస్త్రోత్పత్తి గిట్టుబాటు కావడం లేదని ఆధునిక మరమగ్గాలను అమ్మేస్తున్నారు. తాజాగా ఆదివారం మొత్తం పరిశ్రమలను నిరవధికంగా బంద్‌ పెట్టడంతో అక్కడ పనిచేసే 1,500 మంది కార్మికులు రోడ్డునపడ్డారు. మంత్రి కేటీఆర్‌ ప్రాతి నిధ్యం వహిస్తున్న సిరిసిల్లలోనే టెక్స్‌టైల్‌ పార్క్‌ మూతపడటం చర్చనీయాంశమైంది. 

కరెంట్‌ ‘షాక్‌’ కారణం..
రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి శివారులో 65 ఎకరాల్లో 2003లో టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటైంది. ఇక్కడ 7,000మంది కార్మికులకు ఉపాధి కల్పిం చాల్సి ఉండగా.. 3వేల మందికే పని లభిస్తోంది. పార్క్‌లో 113 యూనిట్లలో (1,695 మగ్గాలు) వస్త్రోత్పత్తి జరుగుతోంది. ఇటీవల సంక్షోభానికి గురైన 25మంది యూనిట్ల యజమానులు ఆధునిక ర్యాపియర్స్‌ లూమ్స్‌ను అమ్మేసుకున్నారు.

వసతుల లేమి.. విద్యుత్‌ చార్జీల భారం పార్క్‌లోని పరిశ్రమ లకు శాపంగా మారాయి. సిరిసిల్లలోని పాత మర మగ్గాలకు 50% విద్యుత్‌ రాయితీని ప్రభుత్వం అమ లుచేస్తోంది. అదే టెక్స్‌టైల్‌ పార్క్‌లో వస్త్రోత్పత్తిదా రులకు యూనిట్‌ కరెంట్‌ ధర రూ.7.50 ఉంది. అదే మహారాష్ట్రలో యూనిట్‌ విద్యుత్‌ చార్జీ రూ.3గా ఉంది. తమిళనాడులో 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తుండగా.. అంతకుమించి వినియోగిస్తే.. ప్రతి యూనిట్‌కు రూ.2.50గా ఉంది. గతంలో టెక్స్‌టైల్‌ పార్క్‌లోని యూనిట్లకు.. 2014 డిసెంబర్‌ నాటికి 50% విద్యుత్‌ రాయితీని ప్రభుత్వం అందించి నిలిపివేసింది.

ఇప్పుడు పూర్తి స్థాయిలో పరిశ్రమల యజమానులే విద్యుత్‌ బిల్లు చెల్లిస్తున్నారు. మరోవైపు నూలు రేట్లు బాగా పెరగడం, రవాణా చార్జీలు ఎక్కువ కావడంతో వస్త్రోత్పత్తి వ్యయం పెరిగింది. ఆ మేరకు మార్కెట్‌లో బట్టకు రేటు లభించక నష్టాలను చవిచూస్తున్నారు. ఫలితంగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో పరిశ్రమలను నిరవధికంగా మూసివేశారు.

యజమానుల డిమాండ్లు ఇవీ..
2015 జనవరి – 2020 డిసెంబర్‌ వరకు విద్యుత్‌ సబ్సిడీ రీయింబర్స్‌ చేయాలి.
పార్క్‌లో మరమగ్గాల ఆధునీకరణకు, కొత్త యూనిట్లకు 25% ప్రోత్సాహకం ఇవ్వాలి.
పరిశ్రమలకు కేటాయించిన ప్లాట్లకు ‘ఎన్‌వోసీ’ సరళతరం చేయాలి.
టెక్స్‌టైల్‌ పార్క్‌లో కమ్యూనిటీ ఫెసిలిటీ సెంటర్‌ (సీఎఫ్‌సీ) ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వం వస్త్రోత్పత్తి ఆర్డర్లను 25% టెక్స్‌టైల్‌ పార్క్‌కు ఇవ్వాలి.
యువకులకు మగ్గాలపై శిక్షణ ఇవ్వాలి.

మంత్రి కేటీఆర్‌ చొరవచూపాలి
సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌లో నెలకొన్న సమస్యలపై మంత్రి కేటీఆర్‌ చొరవచూపి ఆదుకోవాలి. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ రాయితీ రీయింబర్స్‌మెంట్‌ అందించాలి.    
– అన్నల్‌దాస్‌ అనిల్‌కుమార్, పార్క్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు 

మరిన్ని వార్తలు