U19 WC 2024: క్రికెట్‌ వరల్డ్‌కప్‌ జట్టులో పోత్గల్‌ కుర్రాడు.. కేటీఆర్‌ హర్షం! పోస్ట్‌ వైరల్‌

14 Dec, 2023 11:54 IST|Sakshi

U19 World Cup 2024 India Squad: యువ క్రికెటర్లు అరవెల్లి అవినాశ్‌ రావు, మురుగన్‌ అభిషేక్‌లకు తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అభినందనలు తెలిపారు. వీరిద్దరు కెరీర్‌లో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

కాగా దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 19-  ఫిబ్రవరి 11 వరకు అండర్‌-19 క్రికెట్‌  వరల్డ్‌కప్‌ టోర్నీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో బీసీసీఐ జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఇందులో పాల్గొనబోయే భారత యువ జట్టును మంగళవారం ప్రకటించింది. ఇదే టీమ్‌ సౌతాఫ్రికాతో ట్రై సిరీస్‌లోనూ పాల్గొననుంది.

పోత్గల్‌ కుర్రాడంటూ కేటీఆర్‌ హర్షం
ఇక మొత్తంగా పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో హైదరాబాద్‌కు చెందిన అరవెల్లి అవినాశ్‌ రావు, మురుగన్‌ అభిషేక్‌లకు చోటు దక్కింది. ఈ విషయంపై స్పందించిన భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

‘‘అండర్‌-19 క్రికెట్‌ వరల్డ్‌కప్‌ జట్టు, సౌతాఫ్రికాతో ట్రై సిరీస్‌ ఆడే జట్టు ఎంపికైనందుకు అరవెల్లి అవినాశ్‌ రావుకు శుభాకాంక్షలు. ఈ యువ క్రికెటర్‌ రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం పోత్గల్‌ గ్రామంలో పుట్టిపెరిగాడు’’ అంటూ అవినాశ్‌ సక్సెస్‌ పట్ల కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. 

అభిషేక్‌కు కూడా కంగ్రాట్స్‌
కాగా ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికట్లో కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల నుంచి శాసన సభ్యులుగా మరోసారి ఎన్నికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మరో ట్వీట్‌లో అభిషేక్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘హైదరాబాద్‌ నుంచి అండర్‌-19 వరల్డ్‌కప్‌ జట్టుకు సెలక్ట్‌ అయిన మురుగన్‌ అభిషేక్‌కు కంగ్రాట్స్‌. అవినాశ్‌, అభిషేక్‌ ఇద్దరూ మెగా టోర్నీలో రాణించాలని కోరుకుంటున్నా’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఇక హైదరాబాద్‌ జట్టుకు ఆడుతున్న అవినాశ్‌ వికెట్‌ కీపర్‌గా.. అభిషేక్‌ ఆఫ్‌స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. ఇక వీరిద్దరు దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఈ క్రమంలో అండర్‌-19 ఆసియా కప్‌-2023 టోర్నీలో ఆడుతున్నారన్న సంగతి తెలిసిందే.

అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొనే భారత జట్టు:
ఉదయ్‌ సహారన్‌ (కెప్టెన్‌), సౌమీ కుమార్‌  (వైస్‌ కెప్టెన్‌), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్, రుద్రమయూర్‌ పటేల్, సచిన్, ప్రియాన్షు, ముషీర్‌ ఖాన్, అవినాశ్‌ రావు, మురుగన్‌ అభిషేక్‌, ఇనేశ్‌ మహాజన్, ధనుశ్‌ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్‌ లింబాని, నమన్‌ తివారి.  

>
మరిన్ని వార్తలు