తగ్గేదేలే అంటున్న టమాటా.. కిలో ఎంతంటే.. 

10 Dec, 2021 07:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టమాటా ధరలు తగ్గనంటున్నాయి.  గత నెల నుంచి ధరలు భగ్గుమంటూనే ఉన్నాయి. జంటనగరాల అవసరాలకు సరిపడా టమాటా సరఫరా కావడంలేదు. ప్రస్తుతం నగరంలోని గుడిమల్కాపూర్, మోండా, బోయిన్‌పల్లి, మాదన్నపేట, ఎల్‌బీనగర్‌ మార్కెట్లలో టమాటా ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఒక పక్క వ్యవసాయ మార్కెట్లలో ధరలు పెరిగిపోతుంటే, మరోపక్క కొందరు రిటైల్‌ వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు.

నగరానికి రోజుకు దాదాపు 100 నుంచి 120 లారీల టమాటా డిమాండ్‌ ఉంది. కానీ ప్రస్తుతం మార్కెట్‌కు సరఫరా అవుతోంది మాత్రం 40 నుంచి 50 లారీలే. తెలంగాణ జిల్లాల నుంచి టమాటా దిగుమతులు తగ్గడంతో పొరుగు రాష్ట్రాలపైనే వ్యాపారులు ఆధారపడాల్సివస్తోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ నుంచి కొన్ని రోజులుగా నగరానికి టమాటా తరలిస్తున్నారు. అయినా.. నగర అవసరాలను తీర్చలేకపోతున్నాయి.

తెలంగాణ జిల్లాల నుంచి రోజుకు 10 నుంచి 15 లారీలు వస్తుండగా, పొరుగు రాష్ట్రాల నుంచి మరో 35 లారీల మేరకు టమాటా దిగుమతి అవుతోంది. కానీ నగర అవసరాలకు దాదాపు 75 లారీల నుంచి 120 లారీల వరకు డిమాండ్‌ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే కిలో టమాటా రూ.40 నుంచి రూ.45 పలుకుతోంది. రిటైల్‌ వ్యాపారులు రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు.  

మరిన్ని వార్తలు