దసరా నాడు కొత్త జాతీయ పార్టీపై కేసీఆర్‌ ప్రకటన 

3 Oct, 2022 02:33 IST|Sakshi

భేటీకి 283 మందికి ఆహ్వానం.. డిసెంబర్‌ 9న ఢిల్లీ వేదికగా పూర్తిస్థాయిలో ప్రారంభం 

దేశవ్యాప్తంగా కలిసొచ్చే నేతలు, భావ సారూప్య పార్టీల నేతలకు ఆహ్వానం 

ప్రగతిభవన్‌లో మంత్రులు, జిల్లా అధ్యక్షులతో జరిగిన భేటీలో నిర్ణయాలు 

5న జరిగే సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించనున్న కేసీఆర్‌  

విషయం: భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందనున్న టీఆర్‌ఎస్‌ 
ముహూర్తం: దసరా రోజు మధ్యాహ్నం ఒంటి గంటా 19 నిమిషాలకు.. 
వేదిక: తెలంగాణ భవన్‌ 

ఆవిర్భావ సభ: డిసెంబర్‌ 9న ఢిల్లీలో.. (అధికారికంగా ప్రకటించాల్సి ఉంది) 
జెండా: గులాబీ రంగులోనే (చిహ్నం మార్పుతో) 
ఎజెండా: నీళ్లు, నియామకాలు, రైతులు, అభివృద్ధి (దసరా రోజు భేటీలో కేసీఆర్‌ స్పష్టత ఇస్తారు) 

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్ర సమితి ఇక భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందుతోంది. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 5న మధ్యాహ్నం ఒంటి గంటా 19 నిమిషాలకు తెలంగాణ భవన్‌ వేదికగా కొత్త జాతీయ పార్టీ పేరును టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ లాంఛనంగా ప్రకటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక భేటీలో ఈ మేరకు తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

రాష్ట్ర మంత్రులతోపాటు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 33 జిల్లాల అధ్యక్షులు, ఇతర కీలక నేతలతో కలిసి భోజనం చేసిన సీఎం కేసీఆర్‌.. అనంతరం వారితో సమావేశమయ్యారు. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో చాలా వరకు జాతీయ రాజకీయాలు, బీజేపీ పాలన తీరు, కాంగ్రెస్‌ పరిస్థితి, కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు వస్తున్న స్పందన తదితరాలపై మాట్లాడినట్టు తెలిసింది. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ పలువురు మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు ఆహ్వానించినట్టు సమాచారం. 

దసరా రోజు విస్తృతస్థాయి సమావేశం 
కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్‌ కీలక ప్రకటన చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 5న తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పోరేషన్లు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లను ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గం, 33 జిల్లాల అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులనూ కలుపుకొని మొత్తం 283 మంది ప్రతినిధులు విస్తృతస్థాయి భేటీలో పాల్గొననున్నారు. జిల్లాల వారీగా ఆహ్వానితులను సమన్వయం చేయాల్సిన బాధ్యతలను మంత్రులు, పార్టీ అధ్యక్షులకు అప్పగించారు.

తెలంగాణ భవన్‌లో ఉదయం 11 గంటలకు
సమావేశం ప్రారంభం కానుండగా.. నిర్ణయించిన ముహూర్తానికి టీఆర్‌ఎస్‌ కొత్త జాతీయ పార్టీగా మారుతున్నట్టుగా సీఎం కేసీఆర్‌ ప్రకటన చేస్తారు. సమావేశం ముగిశాక తెలంగాణ భవన్‌లోనే పార్టీ ప్రతినిధులతో కలిసి కేసీఆర్‌ భోజనం చేస్తారు. 

డిసెంబర్‌లో.. ఢిల్లీ వేదికగా.. 
ఈ ఏడాది డిసెంబర్‌ 9న దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కొత్త జాతీయ పార్టీని కేసీఆర్‌ పూర్తిస్థాయిలో ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఢిల్లీలో భారీ ఎత్తున ఆవిర్భావ సభ ఏర్పాటు చేసి.. కొత్త జాతీయ పార్టీతో కలిసి వచ్చే నేతలు, జాతీయ స్థాయిలో భావ సారూప్య పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానిస్తారు.

ఢిల్లీ బహిరంగ సభ డిసెంబర్‌ 9నే ఉంటుందా, లేక మరో తేదీన జరుగుతుందా అన్నదానిపై ఈ నెల 5న తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో స్పష్టత వస్తుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉన్న గులాబీ రంగు జెండా, చిహ్నం స్వల్ప మార్పులతో కొత్త జాతీయ పార్టీ కొనసాగనుంది.

కొత్తగా ఏర్పాటయ్యే జాతీయ పార్టీ పేరు భారత రాష్ట్ర సమితిగా దాదాపుగా ఖరారైనా.. ఈ నెల 5వరకు సస్పెన్స్‌ కొనసాగే అవకాశముంది. కొత్త పార్టీ విధి విధానాలు, తదుపరి కార్యాచరణపై దసరా రోజు జరిగే సమావేశంలో కేసీఆర్‌ స్పష్టత ఇవ్వనున్నారు. 

అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు! 
‘‘బీజేపీ దుర్మార్గాలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. రాబోయే రోజుల్లో కేంద్రంలో ఇదే ప్రభుత్వం కొనసాగితే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం. బీజేపీ అధికార దాహంతో ప్రజస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ క్రమంగా జనాదరణ కోల్పోతోంది. మనం ఏర్పాటు చేస్తున్న జాతీయ పార్టీ బీఆర్‌ఎస్‌కు అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు లభిస్తోంది.

తెలంగాణ అభివృద్ధి మోడల్‌ను, రైతు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్‌ వస్తోంది..’’ అని ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ పేర్కొన్నట్టు తెలిసింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రస్తుతం రాజకీయంగా అత్యంత బలంగా ఉందని.. మునుగోడు ఉప ఎన్నికలో మంచి మెజారిటీతో గెలవబోతున్నామని స్పష్టం చేసినట్టు సమాచారం. దీనితోపాటు జాతీయ పార్టీ ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నందునే బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తోందని కూడా పేర్కొన్నట్టు తెలిసింది.   

మరిన్ని వార్తలు