జానారెడ్డి స్వగ్రామంలో ఉద్రిక్తత: నోముల భగత్‌కు నో ఎంట్రీ

14 Apr, 2021 00:01 IST|Sakshi

నాగార్జున సాగర్: ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం చేసేందుకు నాగార్జున సాగర్‌ నియోజకవర్గ పరిధిలోని అనుముల గ్రామానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ చేరుకునేసరికి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టీఆర్‌ఎస్‌ నాయకులు రావొద్దంటూ కాంగ్రెస్‌ శ్రేణులు మంగళవారం ఆందోళన చేపట్టాయి. అనుముల గ్రామానికి టీఆర్ఎస్ ప్రచారానికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కారులో హాలియా వైపు వెళ్తుండగా జై తెలంగాణ అంటూ కారు  వద్ద నినాదాలు చేశాడు. దీంతో ఇబ్బందికి గురిచేసిన టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ వ్యక్తం చేసింది.

తమ నాయకుణ్ణి ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ శ్రేణులు టీఆర్ఎస్ నాయకులు అనుముల గ్రామానికి రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జానారెడ్డి తనయుడు జయవీర్ రెడ్డి వాగ్వాదానికి దిగాడు. జీపు టాప్‌పైకి ఎక్కి టీఆర్‌ఎస్‌, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశాడు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ఇరుపక్షాలకు సర్దిచెబుతున్నారు. అనుముల గ్రామం జానారెడ్డి సొంతగ్రామం కావడంతో టీఆర్‌ఎస్‌కు ప్రవేశం నిషేధించారు. కాగా టీఆర్‌ఎస్‌ నాయకులు సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ సందర్భంగా విస్తృత ప్రచారం చేస్తూ అనుముల గ్రామానికి వచ్చారు.

మరిన్ని వార్తలు