వైద్యులు పని ప్రదేశంలోనే నివాసం ఉండాలి

10 Jun, 2022 00:30 IST|Sakshi

బోధనాస్పత్రులపై సమీక్షలో మంత్రి హరీశ్‌ 

డెంగీ కేసులు పెరుగుతున్నాయని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే వైద్యులంతా పని ప్రదేశంలోనే నివాసం ఉండాలని, బోధనాస్పత్రుల్లోని డాక్టర్లందరూ రోజూ విధులకు హాజరు కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. డ్యూటీ సమ యంలో కూడా కొందరు వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్‌ చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని బోధనాస్పత్రులపై గురువారం నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని, ప్రభు త్వాస్పత్రులన్నీ దీనిపై దృష్టి సారించాలని కోరారు.

బోధనాస్పత్రుల్లో పరిశోధనలు పెంచాల న్నారు. ప్రభుత్వాస్ప త్రుల్లో బయోమెట్రిక్‌ విధానం అమలు చేయాలని, ఆయా విభాగాధి పతులు, సీని యర్‌ ప్రొఫెసర్లు డ్యూటీ చార్ట్‌ ప్రకారం ఓపీలో సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు. ఆస్పత్రుల్లో ప్రసవాలు 99.9 శాతానికి చేరుకున్నా యని, గాంధీలో అవయవ మార్పిడి విభాగం త్వరలోనే పూర్తి కానుందని తెలిపారు.

ఆస్పత్రుల్లో మూడు నెలలకు సరిపడా మందులు తప్పకుండా ఉండా లని, వైద్యులు జనరిక్‌ మందులు మాత్రమే రాయా లని సూచించారు. వారంరోజుల్లో అన్ని ఆస్పత్రుల్లో హెల్ప్‌ డెస్క్‌లను అందుబాటులోకి తేవాలన్నారు. సమీక్షలో వైద్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ ఆరోగ్య సంక్షేమ సంచాలకులు శ్వేతా మహంతి, డీఎంఈ రమేశ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు