ప్రభుత్వాస్పత్రిలో కలెక్టర్‌ సతీమణి ప్రసవం

10 Nov, 2021 12:31 IST|Sakshi

ట్విట్టర్‌ ద్వారా అభినందించిన రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్‌

భద్రాచలం అర్బన్‌: ప్రభుత్వాస్పత్రిలో వైద్యమంటే సాధారణ ప్రజలే ఒకటికి, రెండుసార్లు ఆలోచిస్తుంటారు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌.. తన భార్య మాధవికి ప్రభుత్వాస్పత్రిలోనే ప్రసవం చేయించారు. మంగళవారం రాత్రి పురిటినొప్పులు రాగా, మాధవిని భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. వైద్యులు  ఆమెకు పరీక్షలు చేసి శస్త్రచికిత్స ద్వారా బుధవారం తెల్లవారుజామున 1:19 నిమిషాలకు ప్రసవం చేశారు. మాధవి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. పిల్లల వైద్యనిపుణుడు డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి శిశువుకు వ్యాక్సిన్‌ వేశారు. కాగా, మాధవి గర్భం దాల్చినప్పటి నుంచే ఏరియా ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుంటున్నారని వైద్యులు తెలిపారు. కలెక్టర్‌ అనుదీప్‌ ఆస్పత్రిలో కుమారుడిని ఎత్తుకుని మురిసిపోయారు. వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.  

హరీశ్‌రావు అభినందనలు: కలెక్టర్‌ అనుదీప్‌ నిర్ణయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌లో ప్రçశంసించారు. ‘తల్లీశిశువు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. సమర్థుడైన కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. దీంతో ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులే మొదటి ఛాయిస్‌గా మారాయి’ అని ఆయన పేర్కొన్నారు. మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్‌ కూడా ట్విట్టర్‌ ద్వారా కలెక్టర్‌ దంపతులను అభినందించారు.  


(చదవండి: ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రిలో చేరిన కలెక్టర్‌ భార్య)

చదవండి: అరుదైన బాలుడు.. ప్రతి వెయ్యి మందిలో ఒకరు మాత్రమే ఇలా..

మరిన్ని వార్తలు