రాజయ్యపై సర్పంచ్‌ నవ్య ఆరోపణలు.. మహిళా కమిషన్‌ కీలక ఆదేశాలు

12 Mar, 2023 11:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఊహించని షాక్‌ తగిలింది. రాజయ్యపై మహిళా కమిషన్‌ యాక్షన్‌కు సిద్ధమైంది. ఆయనపై జానకీపురం మహిళ సర్పంచ్‌ నవ్య చేసిన ఆరోపణలను మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. 

ఈ క్రమంలో రాజయ్యపై వ్యక్తిగత విచారణ చేయాలని డీజీపీకి మహిళా కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్విట్ట​ర్‌ వేదికగా కమిషన్‌ ఛైర్మన్‌ సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. 


జరిగింది ఇది.. 
ఎమ్మెల్యే రాజయ్య తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని.. లైంగికంగా వేధిస్తున్నారని సర్పంచ్‌ నవ్య తీవ్ర ఆరోపణలు చేశారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే కాల్‌ చేసి బయటకు రమ్మంటున్నారని నవ్య ఆరోపణలు చేస్తున్నారు. రాజయ్య మాట్లాడిన కాల్‌ రికార్డ్స్‌ ఉన్నాయని పేర్కొన్నారు. సమయం చూసి అవన్నీ భయటపెడతానని అన్నారు. తన వెనక ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఎవరో చెప్పిన మాటలు వినాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇటువంటి వేధింపులు ఎదుర్కొంటూ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

‘నీ మీద కోరికతోనే పార్టీ టికెట్‌ ఇచ్చానని అన్నారు. పక్కన నిలబడితే ఎక్కడెక్కడో చేయి వేస్తారు. హగ్‌ చేసుకోవడానికి వస్తారు. బిడ్డలాంటి దాన్ని అని చెప్పినా మారరా. మీకు సహకరించకుంటే నా బతుకు నాశనం చేస్తారా. రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకుంటారా. దయచేసి ఇప్పటికైనా ఈ అరాచకాలు మానండి. ఇలాంటి వారితో పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తెలిపారు. 

మరిన్ని వార్తలు