టీఎస్‌ఎంసీలో సభ్యుల తగ్గింపుపై తీర్పు 18న

13 Nov, 2022 01:22 IST|Sakshi

ఎన్నిక ద్వారా వచ్చే సభ్యుల తగ్గింపుపై హైకోర్టులో పిటిషన్‌

‘అటానమస్‌’హోదా పోనుందని సామ సందీప్‌రెడ్డి వాదనలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌(టీఎస్‌ఎంసీ)లో ఎన్నిక ద్వారా వచ్చే సభ్యుల సంఖ్య తగ్గింపుపై దాఖలైన పిటిషన్‌లో తీర్పును హైకోర్టు ఈనెల 18కి వాయిదా వేసింది. ఈలోగా గతంలో ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏమైనా ఉంటే కోర్టుకు సమర్పించాలని పిటిషనర్‌ న్యాయవాదికి స్పష్టం చేసింది. టీఎస్‌ఎంసీలో ఎన్నిక ద్వారా వచ్చే సభ్యుల సంఖ్య తగ్గింపుపై హెల్త్‌కేర్‌ రీఫామ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది సామ సందీప్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్నిక ద్వారా వచ్చే సభ్యుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం 13 నుంచి 5కు తగ్గించడం అన్యాయం, చట్టవిరుద్ధమన్నారు. అప్పుడు ప్రభుత్వ నామినేటెడ్‌ సభ్యులు ఆరుగురిదే పైచేయి అవుతుందన్నారు.

చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌ కూడా ప్రభుత్వం చెప్పిన వారికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ ‘అటానమస్‌’హోదా కూడా కోల్పోతుందని వెల్లడించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌లో సభ్యుల సంఖ్య దాదాపు 90 వేలకు పైగా ఉండేదన్నారు. ఇప్పుడు అది దాదాపు 37 వేలకు తగ్గిందని.. ఈ నేపథ్యంలోనే ఎన్నిక ద్వారా వచ్చే సభ్యుల సంఖ్యను కూడా తగ్గించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు అవకాశం ఇవ్వాల్సి ఉన్న క్రమంలో నామినేటెడ్‌ సభ్యుల సంఖ్యను మాత్రం తగ్గించలేదని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు