టీఎస్‌పీఎస్‌సీ కమిషన్‌ నిర్ణయంపై ఉత్కంఠ.. భేటీలో ఏం తేలుస్తారో?

14 Mar, 2023 14:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: TSPSC ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారం కుదిపేస్తుండడంతో టీఎస్‌పీఎస్‌సీ కమిషన్‌ రంగంలోకి దిగింది. ఇవాళ(మంగళవారం) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సమావేశం కావాలని నిర్ణయించుకుంది. 

చైర్మన్‌ జనార్ధన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం కానుంది కమిషన్‌. ప్రశ్నాపత్రాల లీకేజ్‌పై కమిషన్‌ ప్రధానంగా చర్చించనుంది. అనంతరం లీకేజ్‌ వ్యవహారంపై స్పందించే అవకాశం కనిపిస్తోంది. పరీక్షను రద్దు చేస్తుందా? చేస్తే ఆ ఒక్క పరీక్షనే చేస్తారా? లేదంటే మరేయితర నిర్ణయం తీసుకుంటుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక.. వరుస ఆందోళనలు, ఉద్రిక్తతల నేపథ్యంలో టీఎస్‌పీఎస్‌సీ భవనం దగ్గర అదనపు బలగాలను మోహరించారు.

టీఎస్‌పీఎస్‌సీ తాజాగా నిర్వహించిన అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ప్రశ్నపత్రం లీక్‌ అయ్యినట్లు నిర్ధారణ కావడంతో.. ఒక్కసారిగా కలకలం రేగింది. మరోవైపు ఏఈ పరీక్షతో పాటు అంతకు ముందు జరిగిన పలు పేపర్లు కూడా లీకైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు పరీక్షల నిర్వహణను వాయిదా వేసింది కమిషన్‌. అంతేకాదు గత అక్టోబర్‌లో గ్రూప్‌ వన్‌ పరీక్ష జరగ్గా.. ఆ ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ పేపర్‌ కూడా లీకైనట్లు సంకేతాలు అందుతుండడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో గ్రూప్ వన్ పరీక్ష పై వస్తున్న అనుమానాలను పరిశీలిస్తోంది కమిషన్.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ లీకేజీని సీరియస్‌గా తీసుకుంది. వివరణ ఇవ్వాలని కమిషన్‌ను కోరింది. ఇక TSPSC మీటింగ్ తర్వాత సీఎస్‌తోనూ సమావేశమై.. అనంతరం ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది.

ఇక టీఎస్‌పీఎస్‌సీ బిల్డింగ్‌ వద్ద నిరసనలతో అరెస్ట్ అయ్యి.. బేగంబజార్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించిన తెలంగాణ జనసమితి విద్యార్థి నాయకులను ప్రొఫెసర్‌ కోదండరాం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేపర్ లీకేజీ పై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. గతంలో జరిగిన ప్రశ్నాపత్రాలు అన్నింటిపై సమీక్ష జరపాలి కోరారాయన.

మరిన్ని వార్తలు