ఆర్టీసీ సిబ్బందిని కాపాడిన ఓ నిర్ణయం.. 280 మందికిపైగా తప్పిన ప్రాణాపాయం

20 Dec, 2022 03:54 IST|Sakshi

‘హెల్త్‌ చాలెంజ్‌’ పేరుతో 48 వేల మందికి ఇటీవల వైద్య పరీక్షలు 

క్రిటికల్‌ ఈసీజీ కేటగిరీలో 287 మంది గుర్తింపు 

వారికి వెంటనే యాంజియోగ్రామ్, ప్రత్యేక చికిత్సలు 

20 మందికి స్టెంట్లు.. ఇద్దరికి ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలు 

మరికొందరికి ఆపరేషన్ల కోసం ఏర్పాట్లు 

మందుల వాడకంలో నిర్లక్ష్యంతో ఇద్దరి మృతి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)లో ఏటా మరణాలు అధికంగా నమోదవుతుండటాన్ని గుర్తించిన సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ వాటి నివారణ దిశగా తీసుకున్న ఓ నిర్ణయం ఏకంగా 280 మందికిపైగా సిబ్బందికి ప్రాణాపాయం తప్పించింది. మరే ప్రభుత్వ విభాగంలో లేనట్లుగా రెండు నెలల క్రితం ఆర్టీసీలో ‘హెల్త్‌ చాలెంజ్‌’ పేరుతో ఉద్యోగులకు 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 287 మంది తీవ్రమైన హృద్రోగ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తేలింది.

రోజువారీ విధులకు హాజరవుతున్నప్పటికీ వారి గుండె పనితీరు బాగోలేదని, వారి పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. వెంటనే వారికి అత్యవసర వైద్య చికిత్సలు ప్రారంభించారు. సరిగ్గా మందులు వాడని ఇద్దరు మాత్రం మృత్యువాత పడగా మిగతా వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండటంతో అపాయం నుంచి బయటపడ్డారు. ఇందులో డ్రైవర్లే ఎక్కువ మంది ఉన్నందున, వేల మంది ప్రయాణికులను గమ్యానికి చేర్చే డ్రైవర్లు ప్రమాదం నుంచి బయటపడటం ద్వారా పరోక్షంగా ప్రయాణికులకు కూడా ప్రమాదం తప్పినట్టయింది. 

ఆ మరణాలు అలాంటివే... 
ఆర్టీసీలో గత ఆర్థిక సంవత్సరం దాదాపు 225 మంది చనిపోయారు. ఇందులో 60 శాతం మంది గుండె సంబంధిత సమస్యలతోనే ప్రాణాలు వదిలారు. ఏటా సగటున ఆర్టీసీలో 200 మంది వరకు చనిపోతున్నారు. నాలుగేళ్ల క్రితం వరకు ఆ సంఖ్య గరిష్టంగా 180 ఉండగా ఆ తర్వాత అది క్రమంగా 200 దాటుతూ వస్తోంది. అప్పటివరకు డ్యూటీ చేసిన వారు ఉన్నట్టుండి నేలకూలుతున్నారు.

తీవ్ర పని ఒత్తిడిలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు, ఇతర ఫీల్డ్‌ సిబ్బంది ఎక్కువగా చనిపోతున్నారు. దీన్ని గుర్తించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.. ఏకంగా 48 వేల మంది ఉద్యోగులకు డిపోలవారీగా ఓ ప్రైవేటు సంస్థ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించారు. హైబీపీతో బాధపడుతూ సరైన వైద్యం తీసుకోకపోవడం, మందులు సరిగ్గా వాడకపోవడంతో పరిస్థితి క్రిటికల్‌గా మారిన వారు, క్రిటికల్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నవారు, సమస్య ఇప్పుడిప్పుడే పెరుగుతున్నవారు, కొత్తగా ఆ సమస్య పరిధిలోకి వచ్చినవారు ఇలా ఏబీసీడీఈ అంటూ జాబితాలు రూపొందిస్తున్నారు.

అందులో క్రిటికల్‌ ఈసీజీ జాబితాలో 287 మంది చేరారు. శరీరంలో సమస్య తీవ్రంగా ఉన్నట్టు ఆ ఉద్యోగులకు కూడా తెలియదు. రోజువారీ విధులకు హాజరవుతున్నారు. వారికి సంబంధించి కొందరి మెడికల్‌ హిస్టరీ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో ఉంది. కానీ దాన్ని ఫాలో అవుతున్నవారు లేరు. వారి పరిస్థితి అంత బాగోలేదని రిపోర్టులు స్పష్టం చేయటంతో వెంటనే నిమ్స్‌లో ఓ డాక్టర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. వారిలో సమస్య తీవ్రత దృష్ట్యా 60 మందికి యాంజియోగ్రామ్‌ పరీక్షలు నిర్వహించారు. తీవ్ర సమస్య ఉన్న 25 మందికి వెంటనే స్టెంట్లు వేయించారు. ఇక 10 మంది మరింత క్రిటికల్‌గా ఉన్నట్లు తేల్చి అందులో ఇద్దరికి నిమ్స్‌లోనే తాజాగా ఓపెన్‌హార్ట్‌ సర్జరీ నిర్వహించారు. మరో ఇద్దరికి సర్జరీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా వారికి తగిన చికిత్సలు అందిస్తున్నారు. 

మందులు వేసుకోకుండా నిర్లక్ష్యం.. ఇద్దరి మృతి.. 
ప్రమాదకరంగా ఉన్నవారిలో ఇద్దరు డ్రైవర్లు సరిగా మందులు వేసుకోకుండా నిర్లక్ష్యం చేశారు. ఇటీవల ఆ ఇద్దరు మృతి చెందారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎండీ సజ్జనార్‌ వెంటనే మిగతావారు మందులు సరిగా వేసుకునేలా చూడాల్సిన బాధ్యతను డిపో మేనేజర్లకు అప్పగించారు. ఇందుకోసం యాప్‌ ద్వారా అలర్ట్‌ మెసేజ్‌లు డీఎంలకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.

వారికి చికిత్స అందిస్తున్న వైద్య కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు మందులు వాడుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే వెంటనే డీఎంకు మెసేజ్‌ వెళ్తుంది. ఆ మేరకు డీఎంలు వారితో, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి మందులు వాడేలా చర్యలు తీసుకుంటారు. ఫలితంగా మిగతావారి ఆరోగ్యం కుదుటపడుతోంది. త్వరలో వీరంతా తిరిగి విధుల్లోకి వచ్చే పరిస్థితి తేనున్నట్టు వైద్యులు భరోసా ఇస్తున్నారు. 

నిమ్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు.. తార్నాకలోని ఆర్టీసీ 
ఆసుపత్రి, జిల్లాల్లోని డిస్పెన్సరీల్లో సిబ్బందికి చికిత్సలందిస్తున్నారు. నిమ్స్‌లోనూ వారికి ప్రత్యేకంగా బెడ్లు, ఓ డాక్టర్‌ను ఏర్పాటు చేశారు. స్టెంట్లు వేయడం, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలను నిమ్స్‌లో నిర్వహిస్తున్నారు.   

మరిన్ని వార్తలు