ఎస్‌ఆర్‌బీఎస్‌కు ఫుల్‌స్టాప్‌!

4 Apr, 2022 03:04 IST|Sakshi

స్టాఫ్‌ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ స్కీం రద్దు యోచనలో ఆర్టీసీ 

ప్రతినెలా ఉద్యోగుల వేతనం నుంచి రూ.250 ఈ నిధికి మళ్లింపు 

పదవీ విరమణ పొందినవారికి ఆ మొత్తం నుంచి పింఛన్‌ చెల్లింపు 

క్రమంగా నిధి కరిగి.. భారం అవుతుందేమోనని ఆర్టీసీలో భయం 

సాక్షి, హైదరాబాద్‌: పింఛన్‌ వసతి లేదు.. పదవీ విరమణ పొందిన వారికి నెలనెలా చిరుసాయంగా ఉంటూ తోడుంటోందా పథకం.. ఇప్పుడు అది కాస్తా మూతపడబోతోంది. దీంతో ఇటు పింఛన్‌ పథకమూ లేక, అటు నెలనెలా సాయం అందక ఆర్టీసీ ఉద్యోగులకు ఇబ్బంది ఎదురుకాబోతోంది.  స్టాఫ్‌ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ స్కీం (ఎస్‌ఆర్‌బీఎస్‌) పేరుతో ఉద్యోగులకు ఉన్న స్వల్ప ఆసరా పథకాన్ని మూసేసే దిశగా ఆర్టీసీ యోచిస్తోంది.

దీన్ని ఇలాగే కొనసాగిస్తే ఆర్థిక భారం పడుతుందని తేల్చుకున్న అధికారులు దాన్ని ఆపేస్తే మంచిదని ఓ నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అసలే నష్టాలు.. ఆపై కోవిడ్‌ సంక్షోభం ఆర్టీసీని కోలుకోలేని దెబ్బతీసిన విషయం తెలిసిందే. దీంతో ఆర్థికంగా భారం అనిపించే వాటిని వదిలించుకునే దిశలో నిర్ణయాలు జరుగుతున్నాయి. అందులో ఈ ఎస్‌ఆర్‌బీఎస్‌ ఒకటి.  

ఏంటీ పథకం.. 
ఆర్టీసీలో పెన్షన్‌ పథకం లేకపోవటంతో ఎస్‌ఆర్‌బీఎస్‌ని 1989 మేలో ప్రారంభించారు. దీని ప్రకారం ప్రతినెలా ఉద్యోగుల వేతనం నుంచి నిర్ధారిత మొత్తం కట్‌ చేసి ఆ పేరుతో నిధి ఏర్పాటు చేస్తారు. ప్రతినెలా వచ్చే వడ్డీని దీనికి కలుపుతారు. ప్రస్తుతం నెలవారీ కట్‌ చేసే మొత్తం రూ.250 ఉంది. పదవీ విరమణ పొందిన తర్వాత ఆ మొత్తాన్ని నెలనెలా వారికి పింఛన్‌గా చెల్లిస్తారు.

ఈ పథకాన్ని ప్రారం భించినప్పుడు.. ఉద్యోగి వేతనం నుంచి 360 నెల లు నిర్ధారిత మొత్తాన్ని కట్‌ చేయాలని, ఆ తర్వాత డిడక్షన్‌ను ఆపి పింఛన్‌ చెల్లింపును కొనసాగించాలని నిర్ణయించారు. ఇప్పుడు ఉన్నట్టుండి అసలు ఆ పథకాన్నే ఆపేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు డిడక్ట్‌ చేయగా ఏర్పడ్డ మొత్తాన్ని ఉద్యోగులకు చెల్లించి దాన్ని క్లోజ్‌ చేయాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం రిక్రూట్‌మెంట్‌ లేకపోవడం, పదవీ విరమణ పొందినవారు పోను మిగిలిన ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆ నిధి బాగా తగ్గిపోయింది. కొత్తగా రిటైర్‌ అయ్యేవారికి నెలనెలా సరిపడినంత మొత్తాన్ని అందించే పరిస్థితి లేదు. ఇంకా సిబ్బంది సంఖ్య తగ్గితే చెల్లింపు భారం ఆర్టీసీపైనే పడుతుంది. ప్రస్తుతం ఆ నిధికి రూ.13 కోట్ల లోటు ఉందని ఇటీవల లెక్కలు తేల్చారు. దీంతో ఈ పథకాన్ని రద్దు చేయాలని అధికారులు భావిస్తున్నారు.  

ఆర్టీసీ వాటా ఏమైంది..? 
ఆర్టీసీతో 2013 వేతన సవరణ జరిగినప్పుడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వేతన సవరణ కొంత ఆలస్యంగా 2015లో జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎస్‌ఆర్‌బీఎస్‌ నిధికి ప్రతి సంవత్సరం ఆర్టీసీ రూ.6.5 కోట్లు జమ చేయాలని నిర్ణయించారు. కానీ, నష్టాల పేరు చెప్పి ఆర్టీసీ దాని నుంచి తప్పించుకుంటూ వస్తోంది. దీంతో ఆ నిధి బాగా తగ్గి ఏకంగా పథకమే నిలిచిపోయే పరిస్థితికొచ్చింది. ఇక, ఈ నిధి నుంచి ఉద్యోగులకు రుణాలిచ్చి, ఆ రూపంలో వచ్చే వడ్డీని దానికి జత చేయాలని కూడా నిర్ణయించారు. ఐదారేళ్లుగా ఆ రుణాల చెల్లింపును కూడా నిలిపి వేశారు.   

మరిన్ని వార్తలు