పూజకు వేళాయే.. తరలివచ్చిన భక్తజనం.. లఘు దర్శనాలకే అనుమతి 

21 Jun, 2021 08:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వేములవాడ: ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో 40 రోజులుగా మూసి ఉంచిన వేములవాడ రాజన్న ఆలయాన్ని ఆదివారం ఉదయం ఆలయ అధికారులు తెరిచారు. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం కేవలం స్వామివారి లఘు దర్శనం, కల్యాణకట్టలో తలనీలాల సమర్పణ, స్వామివారి ప్రసాదాలను మాత్రమే అనుమతించారు. గర్భగుడి దర్శనాలు, ధర్మగుండం ప్రవేశం నిలిపివేశారు. కోడె మొక్కులు చెల్లించుకునే అంశంపై తుదినిర్ణయం తీసుకుంటామని ఆలయ ఏఈవో హరికిషన్‌ తెలిపారు. 

జోరందుకున్న పుట్టువెంట్రుకలు  
ప్రభుత్వం అన్‌లాక్‌ ప్రకటించడంతో పాటు ఆదివారం మంచిరోజు కావడంతో చిన్నారుల పుట్టు వెంట్రుకలు తీసేందుకు కుటుంబాలతో వచ్చిన వారితో ఆలయ ఆవరణ కిటకిటలాడింది. అలాగే కల్యాణకట్టలోనూ మొక్కులు చెల్లించుకున్నారు. కొత్త పెళ్లి జంటలు సైతం తమ ఇలవేల్పు రాజన్నను కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. చాలా రోజుల తరువాత రాజన్నను దర్శించుకున్నామంటూ జనం సంబరపడిపోయారు. 

స్థానికుల దర్శనాలు 
మూడు మాసాలుగా రాజన్న గుడి మెట్లు ఎక్కని స్థానికులు ఆదివారం వేకువజాము నుంచే స్వామి సన్నిధికి చేరుకుని దర్శించుకున్నారు. మే 12 ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు ముందునుంచే రాజన్న ఆలయాన్ని అధికారులు సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ ప్రకటించడం, సెకండ్‌ వేవ్‌తో చాలా మంది మృతిచెందడంతో స్థానికులు రాజన్న గుడివైపు వెళ్లలేకపోయారు. పాజిటివ్‌ కేసులు తగ్గడం, ప్రభుత్వం అన్‌లాక్‌ ప్రకటించడంతో పురప్రముఖులు, స్థానికులు దర్శనం కోసం క్యూ కట్టారు. పోలీసులు, ఎస్పీఎఫ్‌ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. 

చదవండి: సప్త మాతృకలకు బంగారు బోనం..

మరిన్ని వార్తలు