మృత్యువులోనూ వీడని బంధం

23 Jun, 2021 09:45 IST|Sakshi

సాక్షి, పర్వతగిరి(జనగామ): వివాహ బంధంతో ఒక్కటైన వారు కష్టసుఖాలు పంచుకుంటూ జీవనం సాగించారు. చివరకు మృత్యువులోనూ తమనెవరూ విడదీయలేరన్నట్లుగా నిమిషాల తేడాతో కన్నుమూసిన ఘటన ఇది. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన దారం అన్నపూర్ణ(65), దారం కాశయ్య(68) దంపతులు. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నా, ఇతర ప్రాంతాల్లో నివనిస్తున్నారు. కాగా, అన్నపూర్ణ కొద్ది రోజులుగా పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. అప్పటి నుంచి భార్యకు అన్నీ తానై కాశయ్య సేవలు చేస్తున్నాడు. ఇంతలోనే అన్నపూర్ణ సోమవారం అర్ధరాత్రి దాటాక అకస్మాత్తుగా మృతి చెందింది.

ఈ విషయం తెలియగానే ఆమె భర్త కాశయ్య సైతం శ్వాస విడిచారు. దీంతో బంధువులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. పక్షవాతం బారిన పడిన తనకు భర్త సేవ చేస్తుండడాన్ని తట్టుకోలేక అన్నపూర్ణ మనస్తాపంతో మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు కుమారుడు, కుమార్తెలు చేరుకున్నాక అంత్యక్రియలు నిర్వహించగా, ఆర్యవైశ్య సంఘం బాధ్యులు దారం పూర్ణచందర్, దారం రాము, దారం వెంకన్న, చిదురాల వేణుగోపాల్, దారం సంతోష్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు