ఈ మహిళలు మీనముత్యాలు!

28 Mar, 2021 08:07 IST|Sakshi

కృష్ణా నదిలో చేపలు పడుతున్న తిప్పాయిపల్లి మహిళలు

ఒంటరిగా పుట్టీలలో వెళ్లి.. భారీ వలలతో వేట 

కుటుంబ పోషణలో భాగస్వాములవుతూ పలువురికి ఆదర్శం

వనపర్తి: పురుషుల కంటే తామేమీ తీసిపోబోమని కృష్ణా నదీ తీర ప్రాంతానికి చెందిన మహిళలు నిరూపిస్తున్నారు. కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని తిప్పాయిపల్లిలో 309 కుటుంబాలు ఉండగా అందులో 45 మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వారి జనాభా 200 వరకు ఉంటుంది. గ్రామంలో కొందరు మహిళలు భర్తలతోపాటు 25 ఏళ్ల నుంచి చేపల వేటను సంప్రదాయ వృత్తిగా కొనసాగిస్తున్నారు. కృష్ణా నదిలో ఎక్కువగా నీరు నిలిచినప్పుడు (శ్రీశైలం బ్యాక్‌వాటర్‌) పుట్టీల్లో కూర్చొని సాలు వలల సాయంతో చేపల వేట సాగిస్తున్నారు.

చెరువుల్లో చేపల వేట కోసం ఉపయోగించే వలలకు ఈ సాలు వలలు భిన్నంగా ఉంటాయి. ఒక్కొక్కటీ 200 నుంచి 400 అడుగుల పొడవు.. 10 అడుగుల వెడల్పు ఉంటాయి. ప్రస్తుతం కొందరు మహిళలు నదిలోకి ఒంటరిగానే వెళ్లి చేపలు పడుతున్నారు. మత్స్యకారుల కుటుంబాల్లోని మహిళలతోపాటు బోయ, కుమ్మర, ముస్లిం మతానికి చెందిన వారు కూడా చేపలు వేటాడుతుంటారు. అయితే వారి కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారు. వారు తెచ్చే చేపలను గంపగుత్తగా అన్ని రకాల చేపలను కిలో రూ. 30 చొప్పునే కొనుగోలు చేస్తూ వారానికోసారి డబ్బులిస్తున్నారు. 


ఆరు నెలలు చేపల వేట.. 
కృష్ణా తీర ప్రాంతంలోని తిప్పాయిపల్లిలో చాలా కుటుంబాలు ఏడాదిలో ఆరు నెలలు చేపలవేటపై ఆధారపడి జీవిస్తుంటాయి. మిగతా సమయంలో పొలాలు ఉన్నవారు వ్యవసాయం, ఉపాధి కూలీ పనులు చేసుకుంటున్నారు. ఈ గ్రామ మహిళలను ఆదర్శంగా తీసుకుని తీర ప్రాంతానికి చెందిన పెంచికలపాడు, గుమ్మడం, యాపర్ల, బస్వాపురం గ్రామాల్లోని మహిళలు సైతం చేపలవేట కోసం ఏటి(నదిలోకి)కి వెళ్తుంటారు. ఏటా శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో సెప్టెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు తీర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు చేపలవేట కొనసాగిస్తుంటారు. మార్చి మొదటివారం నుంచి నీరు తగ్గడంతో.. ప్రస్తుతం ఐదారు కుటుంబాల కంటే ఎక్కువమంది మహిళలు చేపల వేటకు వెళ్లడం లేదు. 

పట్టించుకోని మత్స్యశాఖ.. 
తిప్పాయిపల్లితోపాటు కృష్ణా నది తీర ప్రాంతంలోని ఏ గ్రామంలోని మత్స్యకార కుటుంబాలకు లైసెన్స్‌లపై అవగాహన కల్పించడంలో మత్స్యశాఖ విఫలమైంది. ఆయా గ్రామాలకు చెందిన చేపలు పట్టే మహిళలకు లైసెన్స్‌లు లేకపోవడంతో (వరుసగా మూడేళ్లు లైసెన్స్‌ రెన్యూవల్‌ ఉండాలి) మత్స్యశాఖ నుంచి బీమా, ఇతర ప్రయోజనాలు పొందడానికి అర్హత ఉంటుంది. మరోవైపు ఒక్కో సాలు వల రూ. 3 వేలు, పుట్టి రూ. 15 వేలు ఉంటుంది. రాళ్లు, ముళ్ల కంపలు వరదతో కొట్టుకొస్తే వలలు చిరిగిపోయి కొత్తవి కొనాల్సి వస్తోందని మత్స్యకార మహిళలు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు