TS: పోటీకి రెడీ.. నియోజకవర్గం ఏది!.. మాజీ మంత్రికి వింత సమస్య

28 Sep, 2023 11:11 IST|Sakshi

వికారాబాద్‌: మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయంలో ఇంకా సందిగ్ధత వీడడం లేదు. ఆయన నేటికీ ఈ విషయంలో డోలాయమానంలోనే ఉన్నారు. అనేక పార్టీలు మారిన ఆయన చివరకు బీజేపీని వీడి మళ్లీ హస్తం గూటికి చేరిన విషయం విదితమే. ఆయన కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం మొదలైననాటి నుంచి పోటీ చేసే స్థానం విషయంలోనూ ఎన్నో ప్రచారాలు కొనసాగుతున్నాయి.

వికారాబాద్‌ వాస్తవ్యుడైన ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. కాంగ్రెస్‌ నుంచి మరో మాజీ మంత్రి బలమైన నాయకుడు గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఉండడంతో ఏసీఆర్‌ నియోజకవర్గం వీడడం అనివార్యమైంది. ఆయన జహీరాబాద్‌ లేదా చేవెళ్ల నుంచి బరిలో ఉంటారనే ప్రచారం సాగుతోంది.

పరిచయాలు ఇక్కడ.. ప్రాంతం అక్కడ
కాంగ్రెస్‌లో చేరింది మొదలు ఏసీఆర్‌ పోటీ చేసే నియోజకవర్గం విషయంలో స్పష్టత ఇవ్వడంలేదు. దీంతో ఆయన అనుచరగనం, అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన పార్టీలో చేరిన తొలినాళ్లలో చేవెళ్ల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఆయన తన సన్నిహితులతోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన కొద్ది రోజులకే ఆయన తల్లిదండ్రులు, తాత ముత్తాతల సొంత నియోజకవర్గం జహీరాబాద్‌ నుంచి పోటీ చేస్తారనే ప్రచారమూ సాగింది. ఇప్పటికే ఆయన అక్కడ పలుమార్లు పర్యటించారు.

కాగా ఏ నియోజకవర్గంలో గెలుపు సునాయాసమనేది తేల్చుకోలేక పోతున్నారు. జహీరాబాద్‌ సొంత నియోజకవర్గమైనప్పటికీ అక్కడ పెద్దగా పరిచయాలు లేవు. ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం వికారాబాద్‌ నియోజకవర్గంలోనే సాగింది. దీంతో ఆయన పునరాలోచనలో పడి చేవెళ్ల నుంచే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని.. తాజాగా పార్టీ పెద్దలతోనూ చర్చించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

గతంలో వికారాబాద్‌ నియోజకవర్గంలో ఉన్న నవాబుపేట మండలం ఇప్పుడు చేవెళ్ల నియోజకవర్గంలో ఉండడం, నవాబుపేట యాదయ్య సొంత మండలమైనా మిగతా మండలాలతో పోలిస్తే ఓటింగ్‌ సరళి వ్యతిరేకంగా ఉంటూ రావడం.. నవాబుపేట మండలంపై ఏసీఆర్‌కు పూర్తిగా పట్టుండడంతో.. చేవెళ్ల నియోజకవర్గంలోనూ పరిచయాలుండడంతో ఆయనకు చేవెళ్ల నుంచి పోటీ చేస్తేనే గెలుపు అవకాశాలుంటాయని సర్వేలు చెబుతున్నట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌లో ఉన్న రత్నం, ఆయన వర్గం నేతలు యాదయ్యతో అంటీముట్టనట్టు ఉండడం తదితర కారణాల నేపథ్యంలో ఏసీఆర్‌ తాజాగా చేవెళ్ల నుంచే బరిలో ఉండాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది.

పార్టీలు మారినా దక్కని ఫలితం
మూడున్నర దశాబ్దాల క్రితం ఎన్టీఆర్‌ హయాంలో వికారాబాద్‌ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన ఏసీఆర్‌ మళ్లీ తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఆయన 2008 వైఎస్‌ హయాంలో జరిగిన ఉప ఎన్నికలో ప్రసాద్‌కుమార్‌ చేతిలో ఓటమి చవిచూశారు. తరువాత 15 ఏళ్ల పాటు ఆయన ప్రతీ ఎన్నికలో ఓటమి తప్పలేదు. దీంతో ఆయన ఒక్క గెలుపు కోసం పరితపిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్ని పార్టీలు మారినా గెలుపును అందుకోలేకపోయారు. బీజేపీలోనూ గెలుపు సాధ్యం కాదని భావించి ఇటీవల కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళీ ఏదో ఒక నియోజకవర్గం నుంచి గెలుపొంది ఫామ్‌లోకి రావాలని చూస్తున్నారు.

మరిన్ని వార్తలు