TS Election 2023: బీఆర్‌ఎస్‌లో వన్‌ మేన్‌ షో ! మరో పార్టీ నో..!

9 Oct, 2023 09:39 IST|Sakshi
బుయ్యని మనోహర్‌రెడ్డి డీసీసీబీ చైర్మన్‌, కేఎల్‌ఆర్‌ మాజీ ఎమ్మెల్యే

బుయ్యని మనోహర్‌రెడ్డి ఆరోపణ!

కాంగ్రెస్‌లో చేరడంతో అంతుపట్టని రాజకీయం..

చోటామోటా నేతలంతా ఢిల్లీలో చేరిక!

తాండూరు అసెంబ్లీ స్థానం కోసమే చేరారంటున్న అనుచరగణం..

పరిగి అసెంబ్లీలో నూతనోత్సాహం..

సాక్షి, వికారాబాద్‌: డీసీసీబీ చైర్మన్‌ ప్రముఖ వ్యాపారవేత్త బుయ్యని మనోహర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ వీడి కాంగ్రెస్‌లో చేరడం వెనుక మర్మమేమిటనేది రాజకీయ వర్గాల్లో అంతుచిక్కని ప్రశ్నలా మారింది. బీఆర్‌ఎస్‌లో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వర్గంలో కీలక నేతగా ఉండటంతోపాటు మంత్రి కేటీఆర్‌తో సాన్నిహిత సంబంధాలున్నాయి. అలాంటి నేత పార్టీ వీడేందుకు సిద్ధమైతే బీఆర్‌ఎస్‌లో ఏ ఒక్క నేత ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.

అయితే బుయ్యని మనోహర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరితే ఢిల్లీలో లేదా గాంధీభవన్‌లో పార్టీ కండువా వేసుకోవాలి. కాని చిన్నపాటి కార్యకర్తలా తాండూరులో చేరడం వెనుక కాంగ్రెస్‌లో ఆగ్రహజ్వాలలు ఎగిసి పడుతున్నాయి. వికారాబాద్‌ జిల్లాలోనే వ్యాపారవేత్తగా ఖ్యాతిగాంచిన బుయ్యని మనోహర్‌రెడ్డి నాటకీయ పరిణామాల నడుమ కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పటికే డీసీసీబీ చైర్మన్‌ హోదాలో కొనసాగుతున్నారు. మనోహర్‌రెడ్డి పరిగిలో బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డారు.

మరోవైపు తన సొంత నియోజవకర్గంలో పర్యటించాలని అధికార పార్టీ నేతలు ఆంక్షలు విధించారంటూ ఆందోళనకు గురయ్యారు. బీఆర్‌ఎస్‌లో వన్‌మెన్‌ షో కొనసాగుతుందంటూ ఇక పార్టీలో కొనసాగడం కష్టమంటూ ప్రకటించారు. కాంగ్రెస్‌లో చేరిన మనోహర్‌రెడ్డికి తన సొంత నియోజకవర్గమైన పరిగిలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి టికెట్‌ ఖాయమని తెలుస్తోంది.

దీంతో రామ్మోహన్‌రెడ్డి చొరవతో తాండూరు అసెంబ్లీ స్థానాన్ని మనోహర్‌రెడ్డికి కేటాయిస్తే ఇటు పరిగి నియోజకవర్గంలోని మనోహర్‌రెడ్డి అనుచరగణమంతా కాంగ్రెస్‌కి మద్దతు పలకడంతో పార్టీ గెలుపు అవకాశాలు అధికమయ్యాయంటూ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు తాండూరు నియోజకవర్గంలో దశాబ్దానికి పైగా బుయ్యని సోదరులు రైస్‌ మిల్లుతో పాటు ఆర్‌బీఎల్‌ పరిశ్రమ ద్వారా తమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు.

టికెట్‌ కోసం సర్వే..
కాంగ్రెస్‌ అధిష్టానం అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ముగ్గురు కాంగ్రెస్‌ నాయకులకు సంబంధించి తాండూరు నియోజకవర్గంలో సర్వేలు నిర్వహిస్తున్నారు. మరో రెండు రోజుల్లో సర్వే పూర్తవుతుంది.

మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌ అభ్యర్థి అంటూ ప్రజల్లోకి..
తాండూరు అసెంబ్లీకి మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌ అభ్యర్థిగా వస్తారంటు ఇప్పటికే నియోజవకర్గంలోని మారుమూల గ్రామ ప్రజల వరకు వెళ్లింది. నెల రోజుల క్రితమే నియోజవకర్గంలో వాల్‌పోస్టర్లను అంటించారు. కేఎల్‌ఆర్‌ అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ సభ్యులు, తాండూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రమేశ్‌ మహరాజ్‌ సైతం మద్దతు పలికారు. అయితే మనోహర్‌రెడ్డి తాండూరు పట్టణంలో పార్టీలో చేరడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తాండూరు అసెంబ్లీకి చేతి గుర్తు ఎవరిని వరిస్తోందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

టికెట్‌ కోసం పోటీ పడుతున్న ఇద్దరు నేతలు..
తాండూరు అసెంబ్లీకి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ఇద్దరు నేతలు తీవ్రంగా ఢిల్లీ స్థాయిలో లాభియింగ్‌ చేస్తున్నారు. వారం రోజులుగా మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌ ఢిల్లీలో మకాం వేశారు. అయితే ఇటీవల పార్టీలో చేరిన డీసీసీబీ మాజీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై భారం వేశారు. దీంతో మనోహర్‌రెడ్డికి టికెట్‌ ఇప్పించే బాధ్యత రేవంత్‌రెడ్డి భుజస్కంధాలపై వేసుకొన్నారు. తన నియోజకవర్గం ఆనుకొని ఉన్న తాండూరు సీటు విషయంలో రేవంత్‌రెడ్డి పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు