జీ–20 సదస్సు: కార్నివాల్‌.. కెవ్వు కేక

27 Mar, 2023 10:08 IST|Sakshi

విశాఖపట్నం: తెలుగు వైభవం చాటేలా సాగరతీరంలో ఆదివారం నిర్వహించిన కార్నివాల్‌ అద్భుతంగా సాగింది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన సందర్శకులు, పర్యాటకులతో బీచ్‌రోడ్డు జనసంద్రంగా మారింది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సాగిన ఈ కార్నివాల్‌తో బీచ్‌రోడ్‌లో పండగ వాతావరణం నెలకొంది. జీ–20 సదస్సు నేపథ్యంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు జీవీఎంసీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన కార్నివాల్‌.. మన సంస్కృతి, సంప్రదా యాలను చాటిచెప్పింది.

వివిధ పాఠశాలలు, కళాశాల విద్యార్థులు కూచిపూడి, భరత నాట్యంతో అలరించారు. అరకు థింసా, బుట్టబొమ్మలు, కోలాటం, భామా కలాపం, వీర నాట్యం వంటి సంప్రదాయ నృత్యాలు అదరహో అనిపించాయి. యువతీ యువకులు దేశ భక్తి గీతాలకు తమదైన శైలిలో నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. పులి వేషాలు, కోమ్ము నృత్యా లు, తప్పెటగుళ్లు, కాళికా వేషాలు, బిందెల డ్యాన్స్‌, డప్పు వాయిద్యాలు, సాము గారడీలు, తదితర ప్రదర్శనలతో కళాకారులు సందర్శకులను మైమరపింపజేశారు. చిన్నారుల ఫ్యాషన్‌ షో,స్కేటింగ్‌ చేస్తూ ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా జీ–20 దేశాల జాతీయ జెండాలను ప్రదర్శించారు. ముందుగా ఈ కార్నివాల్‌ను రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్‌, గుడివాడ అమర్‌నాథ్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. కార్నివాల్‌లో విదేశీయులు సైతం వివిధ వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డిప్యూటీ మేయర్‌ జి.శ్రీధర్‌, మున్సిపల్‌ శాఖ స్పెషల్‌ సెక్రటరి శ్రీలక్ష్మి, కలెక్టర్‌ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజాబాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు