Visakhapatnam: ఆహ్లాదం, విజ్ఞానం పంచేలా పార్కుల అభివృద్ధి

6 Nov, 2023 09:30 IST|Sakshi
సీతమ్మధారలో ఆధునికీకరించిన పార్కు

విశాఖపట్నం: విశాఖ అంటే మనందరికీ ఠక్కున గుర్తొచ్చేది బీచ్‌. కాస్త సేద తీరాలంటే.. ఆహ్లాదం కావాలంటే వెంటనే బీచ్‌లో వాలిపోతాం. ఇప్పుడు మరిన్ని ఆహ్లాదకర ప్రాంతాలను విశాఖ మహా నగర పాలక సంస్థ సిద్ధం చేస్తోంది. ఒక వైపు కొత్త రోడ్లు, కూడళ్ల విస్తరణ పనులు సాగుతుండగా.. మరోవైపు కాలనీల్లో ప్రజలు సేద తీరేలా పార్కులను తీర్చిదిద్దుతోంది. సాధారణ పార్కులకు భిన్నంగా ఉండే థీమ్‌ పార్కులు ఏర్పాటు చేస్తోంది. ఈ పార్కులు ఆహ్లాదం, పచ్చదనం అందిస్తూనే సబ్జెక్ట్‌ థీమ్‌తో మన దృష్టిని కేంద్రీకరిస్తాయి.

విశాఖ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పలు చోట్ల థీమ్‌ పార్కుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. పార్కు అంటే రెండు బల్లలు.. మూడు మొక్కలు వేయడం కాదు. కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన నగరంలో ప్రజలకు పూర్తి స్థాయిలో పార్కులు ఆహ్లాదం పంచగలగాలి. పర్యావరణానికి మేలు చేయాలి. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులకు ఉపయోగపడాలి. వాకింగ్‌ ట్రాక్‌లు, యోగా కేంద్రాలు, ఓపెన్‌ థియేటర్లు, మెడిటేషన్‌ సెంటర్లు, ఓపెన్‌ జిమ్‌లు, క్యాంటీన్లు, మరుగుదొడ్లు ఇలా అన్నీ ఉండాలి. వినోదంతో పాటు విజ్ఞానం పంచాలి. ఇవన్నీ ఒకే చోట ఉండేలా థీమ్‌ పార్కులు ఏర్పాటు చేస్తోంది. కోట్లాది రూపాయలు వెచ్చించి ఆధునికీరిస్తోంది.

ఎక్కడెక్కడ అంటే..
► జోన్‌–2 పరిధిలో రూ.7.15 కోట్లతో నాలుగు థీమ్‌ పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. రూ.1.94 కోట్లతో జీవీఎంసీ థీమ్‌ పార్కు, షిప్‌యార్డ్‌ లేఅవుట్‌లో రూ.1.92 కోట్లతో యోగా అండ్‌ మెడిటేషన్‌ థీమ్‌ పార్కు, బక్కన్నపాలెం లచ్చిరాజు లేవుట్‌లో రూ.1.95 కోట్లతో స్పోర్ట్స్‌ థీమ్‌ పార్కు, రూ.1.34 కోట్లతో పామ్‌ గార్డెన్స్‌ థీమ్‌ పార్కు పనులు 50 శాతం పైనే పూర్తయ్యాయి.

► జోన్‌–3 పరిధిలో రూ.2.65 కోట్లతో రెండు పార్కులు అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో రూ.1.53 కోట్లతో శివాజీ పార్కు ఆధునికీకరణ పనులు ప్రారంభించగా.. 90 శాతం మేర పూర్తయ్యాయి. ఎంవీపీ సెక్టార్‌–11లో రూ.1.12 కోట్లతో చేపడుతున్న థీమ్‌ పార్కు పనులు 85 శాతం మేర పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

► జోన్‌–5బి పరిధి గుల్లలపాలెం పార్కును అభివృద్ధి చేస్తున్నారు. రూ.39.40 లక్షలతో చేపట్టిన గుల్లలపాలెం పార్కు పనులు 55 శాతం మేర పూర్తయ్యాయి.

► జోన్‌–8 పరిధి సుజాతనగర్‌లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్‌ థీమ్‌ పార్కు పనులు 60 శాతం పూర్తయ్యాయి. రూ.1.78 కోట్లతో ఈ పార్కును అభివృద్ధి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు