లారీ ఢీకొని వృద్ధురాలి మృతి

9 Nov, 2023 01:20 IST|Sakshi

భీమవరం: భీమవరం వన్‌టౌన్‌ పరిధిలోని అంబేడ్కర్‌ కూడలిలో లారీ ఢీకొనడంతో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. సీఐ గుత్తుల శ్రీనివాస్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడ పాయకపురానికి చెందిన కందుకూరి సత్యవతి (60) తల వెంట్రుకల వ్యాపారం చేస్తుంది. అంబేడ్కర్‌ సెంటర్‌లో బుధవారం ఆమె నడిచి వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. మృతురాలి దగ్గర ఉన్న ఫోన్‌ ఆధారంగా ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు మృతదేహాన్ని గుర్తించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

నేడు కేవీకేలో రైతు సదస్సు

ఉండి: ఉండి ఎన్నార్పీ అగ్రహారంలోని కృషీ విజ్ఞాన కేంద్రం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని కేవీకేలో గురువారం సేంద్రియ, ప్రకృతి, వ్యవసాయ, ఉత్పత్తిదారులు, వినియోగదారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌.మల్లికార్జునరావు మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి గోదావరి మండలాల సహ పరిశోధకురాలు, డాక్టర్‌ ఎం.భరతలక్ష్మీ, మారుటేరు, ఏరువాక, సేంద్రియ, వ్యవసాయ, విజయరాయి శాస్త్రవేత్తలు పాల్గొంటారన్నారు. అలాగే ఆసక్తి గల రైతులు, వినియోగదారులు, ఉత్పత్తిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

‘విర్డ్‌’లో కృత్రిమ అవయవాల పంపిణీ

ద్వారకాతిరుమల: పోలియో సెరిబ్రల్‌ పాల్సీ వ్యాధితో బాధపడుతున్న రోగులకు స్థానిక విర్డ్‌ ఆస్పత్రిలో ఉచితంగా కాలిపర్స్‌, కృత్రిమ అవయవాలను అందజేస్తున్నట్టు ఆస్పత్రి ట్రస్ట్‌ చైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరుకు చెందిన గుప్తా ఫౌండేషన్‌ సహకారంతో కాలిపర్స్‌తో పాటు, చేతులు, కాళ్లు లేని వారికి కృత్రిమ అవయవాలను అందిస్తామన్నారు. సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు విర్డ్‌ ఆస్పత్రిలోని వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఇతర వివరాలకు 83744 45108 సెల్‌ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

మరిన్ని వార్తలు