ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు

12 Nov, 2023 00:58 IST|Sakshi

సూర్యాపేట క్రైం : ఎన్నికలకు సూర్యాపేట జిల్లాలో పటిష్టమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్‌ హెగ్డే తెలిపారు. ఎన్నికల్లో పోలీస్‌ బందోబస్తు నిర్వహణ, యాక్షన్‌ ప్లాన్‌పై శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోలీసు అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ఓటర్లకు రక్షణ కల్పించడం, ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరగకుండా అమలు చేయడం పోలీసు ముఖ్య విధి అని అన్నారు. సిబ్బంది ఎన్నికల డ్యూటీపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఒత్తిడి లేకుండా పని చేయాలని, ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యమైన ప్రతి అధికారితో సమన్వయంగా పని చేయాలని సూచించారు. పారామిలిటరీ సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమించాలన్నారు. ఎన్నికల అధికారి అనుమతి లేనివారిని, గుర్తింపు లేని వారిని పోలింగ్‌ బూత్‌లోకి అనుమతించవద్దని సూచించారు. ఎన్నికల ముందు రోజు నుంచి స్థానికేతరులు గ్రామాల్లో సంచరించకుండా ముందస్తు నిఘా ఉంచాలని, పోలింగ్‌ బూత్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చెక్‌ చేసుకోవాలన్నారు. స్ట్రాంగ్‌ రూంల నుంచి పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలను తరలించడం, వాటికి రక్షణ కల్పించడం, పోలింగ్‌ పూర్తయిన తర్వాత కౌంటింగ్‌ కేంద్రాలకు తరలించడంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్ట్రాంగ్‌ రూంల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలన్నారు. వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా పని చేయాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన, ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన పౌరులపై కేసులు తప్పవని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రజలు, ఓటర్లు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వర్‌రావు, డీఎస్పీలు నాగభూషణం, ప్రకాష్‌, రవి, శ్రీనివాస్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేష్‌, ఎలక్షన్‌ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేష్‌, సీఐలు, ఐటీ కోర్‌, కమ్యూకేషన్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అసత్య ఆరోపణలపై చర్యలు తీసుకోవాలి

భువనగిరి రూరల్‌ : బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆరోపణలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల ఏజెంట్‌ కోమటిరెడ్డి మోహన్‌ రెడ్డి శనివారం భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సోషల్‌ మీడియాలో పైళ్ల శేఖర్‌రెడ్డిపై కాంగ్రెస్‌ చార్జిషీట్‌ పేరుతో తప్పుడు ఆరోపణలతో ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపించి, ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

భర్తను హత్య చేసిన భార్య

తాగి వచ్చి వేధింపులకు గురి చేస్తుండడంతో ఘాతుకం

కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో ఆలస్యంగా వెలుగులోకి..

కోదాడ రూరల్‌: భర్త తాగి వచ్చి వేధింపులకు గురి చేస్తుండడంతో భార్య తట్టుకోలేక అతడిని హతమార్చింది. ఈ సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. కొమరబండకు చెందిన కామళ్ల పుల్లయ్య(45) అనుమానాస్పద స్థితిలో శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. శనివారం సోదరులు, బంధువులు మృతుడి అంత్యక్రియలు చేసేందుకు స్నానం చేయిస్తుండగా అతడి మెడపై గాయాలు కనిపించాయి. అనుమానం వచ్చిన సోదరులు అతడి భార్య ఆదిలక్ష్మిని నిలదీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య ఆదిలక్ష్మిని అదుపులోకి తీసుకొని విచారించగా తాగి వచ్చి వేధింపులకు గురిచేస్తుండగా.. తట్టుకోలేక మెడకు వైర్‌ బిగించి హత్య చేసినట్లు ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. అయితే ఒక్కతే ఈ హత్యకు పాల్పడిందా, ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా.. వీరికి వివాహమైన కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.

టపాకాయల దుకాణదారుల మధ్య ఘర్షణ

మిర్యాలగూడ అర్బన్‌: టపాకాయల షాపు నిర్వాహకుల మధ్య జరిగిన ఘర్షణలో భాగంగా ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం రాత్రి మిర్యాలగూడ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు.. మిర్యాలగూడ పట్టణానికి చెందిన జగడం అశోక్‌ టపాకాయల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతడికి సమీపంలో టపాకాయల వ్యాపారం నిర్వహించే జాస్తి గోపి తన దుకాణం లైసెన్స్‌ రెన్యూవల్‌ చేసుకోకపోవడంతో తనిఖీలకు వచ్చిన అధికారులు అతడి దుకానాన్ని సీజ్‌ చేశారు. జగడం అశోక్‌ తనపై ఫిర్యాదు చేయడంతోనే అధికారులు తన షాపు సీజ్‌ చేశారని ఆవేశంతో గోపితో పాటు అతడి కుటుంబ సభ్యులు అశోక్‌పై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. అశోక్‌ దుకాణాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. వారి నుంచి తప్పించుకున్న అశోక్‌ అక్కడి నుంచి తప్పించుకుని నేరుగా మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించారు. ఈ మేరకు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాఘవేందర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు