అన్నను దారుణంగా హత్యచేసిన తమ్ముడు..

27 Feb, 2024 02:10 IST|Sakshi
రాంబాబు (ఫైల్‌)

ఇల్లు మరమ్మతుల విషయమై గొడవపడి ఘాతుకం

కత్తిపీటతో నరికి, తలపై బండరాయి మోది చంపిన నిందితుడు

శాలిగౌరారం మండలం పెర్కకొండారంలో ఘటన

యాదాద్రి: ఇల్లు మరమ్మతుల విషయంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయిన తమ్ముడు సొంత అన్నను దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలంలోని పెర్కకొండారం గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పెర్కకొండారం గ్రామానికి చెందిన చర్లపల్లి వెంకన్న, పద్మ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం.

వెంకన్న అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతిచెందాడు. పద్మ తనకున్న రెండున్నర ఎకరాల భూమిని కౌలుకు ఇచ్చి తన ఇద్దరు కుమారులు చర్లపల్లి రాంబాబు(28), నవీన్‌ను కూలీ పనులు చేస్తూ సాకుతోంది. నవీన్‌ మద్యంతో పాటు గంజాయి తాగుతూ నిత్యం మత్తులో ఉండేవాడు. రాంబాబు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో వైద్యుల సూచన మేరకు మద్యం అలవాటును మానేశాడు.

రాంబాబు ఇంటివద్దనే సెల్‌ఫోన్‌ రిపేరు దుకాణం ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఆటో నడుపుకుంటూ తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా గతేడాది అర ఎకరం భూమిని విక్రయించారు. ఆ భూమికి సంబంధించిన డబ్బులు ఇటీవల చేతికి రావడంతో అప్పులు తీర్చగా రూ.6 లక్షలు మిగిలాయి. దీంతో పద్మ, రాంబాబు, నవీన్‌ తమ పేరున రూ.2లక్షల చొప్పున బ్యాంకులో డిపాజిట్‌ చేసుకున్నారు.

ఇల్లు రిపేరు చేద్దామని..
వారు ఉంటున్న మూడు గదులు రేకుల ఇంట్లో రోడ్డు వైపు గదిలో రాంబాబు సెల్‌ఫోన్‌ రిపేరు దుకాణం నడుపుకుంటున్నాడు. అందులోనే పద్మ ఉంటుంది. మిగిలిన రెండు గదులలో రాంబాబు, నవీన్‌ విడివిడిగా ఉంటున్నారు. పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్న రాంబాబు ఇల్లు రిపేరు చేసేందుకని తన బాబాయి కొడుకు చర్లపల్లి నరేశ్‌ సమక్షంలో సోమవారం మేస్త్‌త్రతో ఒప్పందం చేసుకున్నాడు. ఆ సమయంలో నవీన్‌ ఇంటి రిపేరుకు డబ్బులు ఇవ్వనని వాధించగా రాంబాబు ఒక్కడే ఇంటి రిపేరు ఖర్చు భరించేందుకు అంగీకరించాడు. అనంతరం రాంబాబు గ్రామంలో ఓ వివాహానికి హాజరయ్యాడు.

షర్ట్‌ మార్చుకునేందుకు వచ్చి..
వివాహంలో స్నేహితులతో కలిసి ఫొటో దిగే సమయంలో షర్ట్‌ మార్చుకొని వస్తానని రాంబాబు తన ఇంటికి వచ్చాడు. అప్పటికే ఇంట్లో గంజాయి మత్తులో ఉన్న నవీన్‌ అన్న రాంబాబుతో ఇంటి రిపేరు విషయమై గొడవ పడ్డాడు. ఈ గొడవ తీవ్ర ఘర్షణకు దారితీయడంతో రాంబాబు ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా నవీన్‌ కత్తిపీటతో రాంబాబుపై దాడిచేశాడు.

ఈ క్రమంలో రాంబాబు తన చేతులు అడ్డుపెట్టగా కత్తిపీట తగలడంతో చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. తప్పించుకునే క్రమంలో రాంబాబు కిందపడిపోగా.. నవీన్‌ కత్తిపీటతో దాడి చేయడంతో రాంబాబు మెడ, తలభాగంపై గాయాలయ్యాయి. గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయిన నవీన్‌ బండరాయితో రాంబాబు తలపై మోదడంతో రాంబాబు అక్కడిక్కడే మృతిచెందాడు. నవీన్‌ గ్రామస్తులు పట్టుకొని చితకబాదుతుండగా అతడు పరారయ్యాడు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రత్యక్ష సాక్షులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. డీఎస్పీ వెంట శాలిగౌరారం ఇన్‌చార్జి సీఐ రాజశేఖర్‌, ఎస్‌ఐ ఐలయ్య, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు. మృతుడి తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇవి చదవండి: భయంతో పైనుంచి దూకిన విద్యార్థిని.. చివరికీ..

whatsapp channel

మరిన్ని వార్తలు