చింతమనేని దాష్టీకంపై భగ్గుమంటున్న దెందులూరు | Sakshi
Sakshi News home page

తల్లిని దూషిస్తూ.. దళితులపై చింతమనేని దాష్టీకం.. భగ్గుమన్న దెందులూరు

Published Sat, Apr 27 2024 10:59 AM

Attack Dalits MLA Abbaya Chowdary Warning Chintamaneni

ఏలూరు, సాక్షి: ఎన్నికల వేళ.. దెందులూరు నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ ప్రచారంలో వీరంగం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ సంక్షేమ ప్రభుత్వం గురించి మాట్లాడిన దళితులపై తన అనుచరులతో దాడి చేయించారు. ఈ ఘటనపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు.. క్షతగాత్రులను పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, చింతమనేని తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. 
శుక్రవారం పెదవేగి మండలం లక్ష్మీపురం కూచిపూడి రామసింగవరం గ్రామాల్లో చింతమనేని, తన అనుచరులతో ప్రచారానికి వెళ్లారు. ఆ సమయంలో యర్ర చంటిబాబు అనే యువకుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంచి జరిగిందంటూ వ్యాఖ్యానించాడు. దీంతో కోపోద్రిక్తులైన చింతమనేని అనుచరులు అతనిపై దాడికి దిగారు. అడ్డుకోబోయిన మరికొందరు యువకులపైనా దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ ఐదుగురు యువకుల్ని హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరిలు, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఆస్పత్రికి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. 
చింతమనేనిపై దెందులూరు ప్రజానీకం, దళిత సంఘాలు ఆగ్రహం వెల్లగక్కుతున్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చాయి. మరోవైపు ఈ ఉదయం దాడి ఘటనపై ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు.  ‘‘చింతమనేని ఏమాత్రం విలువల్లేని నాయకుడు. చింతమనేని తన హయాంలో చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. 93 కేసులు ఉన్న ఓ రౌడీ షీటర్‌. ఎన్నికల ప్రచారంలోనూ తన ప్రవర్తన ఏమాత్రం మార్చుకోలేదు. దెందులూరులో గొడవలతో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు..
.. ప్రచారంలో భాగంగా దళితవాడలోకి వెళ్లి మరీ దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. సీఎం జగన్‌ హయాంలోనే తనకు మంచి జరిగింది అన్నందుకు ఓ దళిత యువకుడిపై బూతులు తిడుతూ దాడి చేయించాడు. అతని కన్నతల్లిని దుర్భాషలాడారు. ఆ యువకుల్ని చంపే ప్రయత్నం చేశారు. ఇలాంటి వ్యక్తికి బీఫామ్‌ ఇచ్చారు చంద్రబాబు. చంద్రబాబు ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా?.  
దళిత యువకులపై దాడి హేయనీయం. చింతమనేని అరాచకాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. చింతమనేని పోలీసులు వెంటనే అరెస్ట్‌ చేయాలి. దళితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. ‘చింతమనేని.. ఎవరి పేగులు లాగేస్తావ్‌?. ఇలాంటి ప్రవర్తనను కొనసాగిస్తే నువ్వు ప్రచారం చేయలేవ్‌. ప్రజలపై విశ్వాసం లేని మూర్ఖుడివి నువ్వు. చంద్రబాబూ.. చింతమనేనిని ఎన్నికల ప్రచారానికి పంపావా? లేదంటే దళితులపై దాడిచేయమని పంపవా?.. చింతమనేని.. ఇక నుంచి దెందులూరులోని ప్రజలు గ్రామాల్లోకి రానియకుండా నిన్ను కట్టడి చేస్తారు. జాగ్రత్త.. చంద్రబాబు, చింతమనేని ఇద్దరూ బాధితులకు క్షమాపణ చెప్పాలి.. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి హెచ్చరించారు. 

Advertisement
Advertisement