More

ఢిల్లీలో వైఎస్ఆర్సిపి గళం

27 Aug, 2013 22:11 IST
ఢిల్లీలో వైఎస్ఆర్సిపి గళం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలో  ఆ పార్టీ ప్రతినిధి బృందం ఈ రోజు ఢిల్లీలో తెలుగు ప్రజల గళం వినిపించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు  రాష్ట్ర విభజన వల్ల కలిగే నష్టాలను, సీమాంధ్రలో ఉద్యమ తీవ్రతను వివరించారు. దేశ ప్రధమ పౌరుడికి, ప్రధానికి రాష్ట్రంలో పరిస్థితులను వివరించడంలో వారు కృతకృత్యులయ్యారు. అంతే కాకుండా సమన్యాయం చేయకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్తో  జంతర్‌మంతర్ వద్ద రేపు ధర్నా కూడా చేయనున్నారు.  

రాష్ట్రంలో పరిపాలన  అధ్వాన్నంగా ఉంది. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల అన్నివర్గాల ప్రజలూ  తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులలో గత జులై 30న కాంగ్రెస్ పార్టీ  వర్కింగ్ కమిటీ రాష్ట్ర విభజన ప్రకటన చేసింది. నిజానికి దేశంలో కొత్త రాష్ట్రాల డిమాండ్లు రావడంతో   రెండో ఎస్సార్సీ వేయాలని 2001లోనే  సీడబ్ల్యూసీ నిర్ణయించింది. గూర్ఖాలాండ్, బోడోలాండ్, విదర్భ, హరిత ప్రదేశ్  లాంటి కొత్త రాష్ట్రాల డిమాండ్లను తోసిరాజని ఎకాఎకిన, హడావుడిగా ఆంధ్రప్రదేశ్ను విభజించడానికి కాంగ్రెస్ సిద్ధపడింది. కాంగ్రెస్ ఏకపక్షంగా, నిరంకుశంగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సీమాంధ్రలో తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రాన్ని విభజిస్తే అనేక కొత్త సమస్యలు తలెత్తుతాయి. సీమాంధ్రకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని ఆ ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ముఖ్యంగా నదీజలాల సమస్య జఠిలమవుతుంది. ఇది అందరూ అంగీకరించవలసిన విషయం.

 జలవనరులు - ఆదాయ పంపిణీ - హైదరాబాద్ భవిష్యత్తు లాంటి కీలకమైన అంశాలను  చర్చించకుండానే ఇప్పటి వరకు మౌనంగా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా తుది నిర్ణయం ప్రకటించింది.  విభజనతో సంబంధమున్న  ప్రభుత్వ ఉద్యోగులు - వివిధ వ్యాపార- పారిశ్రామిక అసోసియేషన్లు - పౌర సమాజాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా తీసుకున్న  ఈ నిర్ణయాన్ని అందరూ అంగీకరించి తీరవలసిందే అన్న రీతిలో ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజనపై తాంబూలాలు ఇచ్చేశాం-తన్నకు చావండి అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది.  ఈ విషయాలన్నింటితో కూడిన మెమోరాండంను   విజయమ్మ నాయకత్వంలో  ఆ పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్రపతి, ప్రధానికి అందజేశారు. రాష్ట్ర విభజన జరిగితే తలెత్తే సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ బృందంలో విజయమ్మ వెంట ఎంపి  మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, సుచరిత, ముఖ్య నేతలు  మైసూరారెడ్డి,  సోమయాజులు, కొణతాల రామకృష్ణతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

రాష్ట్ర విభజన విషయంలో వైఎస్ఆర్సిపి మొదటి నుంచి ఒకే మాటపై ఉంది.  విభజన అనివార్యమైతే  అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని, ఎవ్వరికీ అన్యాయం జరగకుండా కేంద్రం ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించాలని  కోరుతోంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర విభజన తథ్యమంటూ జులై 30న కాంగ్రెస్‌ ప్రకటించింది. అప్పటికే  ఆ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు  పదవులకు రాజీనామా చేశారు.ఆ తరువాత  పార్టీ అధ్యక్షుడు  జగన్మోహన రెడ్డితోపాటు రాజమోహన రెడ్డి కూడా తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. విజయమ్మతోపాటు ఎమ్మెల్యేలు కూడా ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే ప్రభుత్వా వారి దీక్షలను భగ్నం చేసింది. ఈ పరిస్థితులలో చంచల్గూడ జైలులో ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి కూడా ఆమరణ దీక్ష చేపట్టారు.

ఈ నేపధ్యంలో ప్రతినిధి బృందం ప్రధానిని కలిసింది. 57ఏళ్లుగా కలిసున్న రాష్ట్రాన్ని ఒక్క నిర్ణయంతో విభజన దిశగా నెడుతున్నారని ప్రధానికి ఇచ్చిన మూడు పేజీల లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.  రాష్ట్ర ఆదాయంలో 40 శాతం కంటే ఎక్కువ రాజధాని హైదరాబాద్ నుంచే వస్తోందని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలోనే అభివృద్ధి అంతా కేంద్రీకృతమై ఉందని తెలిపారు.  రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు, విద్య, పరిశోధన సంస్థలు ఇక్కడే ఉన్నాయని ప్రధానికి వివరించారు. అన్నిరకాల మౌలిక సదుపాయాలు కూడా ఉండటంతో ప్రైవేట్‌ కంపెనీలు కూడా ఇక్కడే నెలకొల్పారు. పెట్టుబడులన్నీ ఇక్కడికే వచ్చాయని తెలిపారు.  ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రధాని ముందు వారు ఆందోళన వెలిబుచ్చారు. తెలుగు ప్రజల్లో  62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడిన పరిస్థితుల్లో జల వనరుల అంశాన్ని తేల్చకుండా ఎలా విభజిస్తారని వారు ప్రధానిని ప్రశ్నించారు. వీటిపై ప్రధాని  స్పందించారు.  మంత్రుల బృందంతో కమిటీ ఏర్పాటు చేస్తామని వారికి చెప్పారు.  ఆ కమిటీ రాష్ట్ర సమస్యల పరిష్కారాలను సూచిస్తుందని వారికి హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో రెండు ప్రాంతాల ప్రజలకు  సంతృప్తికరమైన పరిష్కారం చూపేంత వరకూ రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకోకుండా ఆదేశించాలని ఈ బృందం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి విజ్ఞప్తి చేసింది. భవిష్యత్‌ పరిణామాలు ఆలోచించకుండా  తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ అనుసరిస్తున్న తీరు విచారకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. జులై 30 తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాష్ట్రపతి  దృష్టికి తెచ్చింది.  కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయం రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చిందని  విజయమ్మ రాష్ట్రపతికి వివరించారు.  రాష్ట్రంలో పరిస్థితిని వివరిస్తూ నాలుగు పేజీల విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి సమన్యాయం పాటించాలని కోరుతూ తాను దీక్ష చేసిన విషయాన్ని, జగన్‌ మోహన్‌ రెడ్డి  జైల్లో చేస్తున్న దీక్ష విషయాన్ని ఆమె రాష్ట్రపతికి వివరించారు. రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయలేనప్పుడు యథాతథ స్థితి కొనసాగించాలన్నది తమ పార్టీ డిమాండ్ని  విజయమ్మ రాష్ట్రపతికి తెలిపారు.

ఆ తరువాత వారు జనతాదళ్‌ యునైటెడ్‌ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ను కూడా కలిశారు. పరిస్థితిని వివరించారు. రాష్ట్ర విభజన విషయంలో ఎదురువుతున్న సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని ఆయన చెప్పారు.  విభజన అనేది చాలా బాధాకరమైన అంశమని శరద్‌ యాదవ్‌ అన్నారు. విభజన జరిగితే ఇరు ప్రాంతాల ప్రజలకు న్యాయం జరగాల్సి ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

 రాష్ట్ర విభజన - రాష్ట్ర భవిష్యత్ - ప్రజా సంక్షేమం ...వంటి విషయాలలో వైఎస్ఆర్ సిపి పూర్తి స్పష్టతతో ఉంది.  ఇరు ప్రాంతాలకు సమ న్యాయం చేయండి లేదా యథాతథంగా ఉంచండి అని ప్రకటించి పోరాడుతోంది. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రజల పక్షం నిలబడి ఢిల్లీ వరకు వెళ్లి తెలుగువారి గళం వినిపించారు. ప్రజలు ఎంత ఉద్యమించినా  ప్రధాన పతిపక్షం టీడీపీ మాత్రం ఇంకా రెండు కళ్ల సిద్దాంతాన్నే నమ్ముకుంది.  ఆ పార్టీ అధ్యక్షుడు, ఆ సిద్ధాంత కర్త చంద్రబాబు   రెండు కాళ్లకు బంధం వేసుకుని ప్రజలెటుపోతే తనకేంటి అని ఇంట్లో కూర్చున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

తుది దశకు ‘వెలిగొండ’

పింఛన్ల పంపిణీకి జాతీయ అవార్డు 

తణుకులో కదం తొక్కిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు

విశాఖ తూర్పులో సామాజిక న్యాయ నినాదం

మళ్లీ జగనే కావాలి..