More

వచ్చే నెల1 నుంచి ధర్నాలు, బంద్‌లు

28 Jan, 2016 23:02 IST
వచ్చే నెల1 నుంచి ధర్నాలు, బంద్‌లు

విజయవాడ(గాంధీనగర్): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఉద్యమబాట పట్టనుంది. ఫిబ్రవరి ఒకటిన అన్ని జిల్లా కేంద్రాల్లో రాస్తారొకోలు, 2న ధర్నాలు, కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని, 3న విద్యాసంస్థల బంద్ నిర్వహించాలని కమిటీ పిలుపునిచ్చింది. విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఐక్యకార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పి.రాజీవ్త్రన్, ఎ.రవిచంద్ర మాట్లాడుతూ రోహిత్ మరణానికి కారకులైన కేంద్రమంత్రులు స్మృతిఇరానీ, దత్తాత్రేయలను క్యాబినెట్ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నా కేంద్రప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన మాత్రమే చేసి రోహిత్ విషయాన్ని పక్కన పెట్టారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతోన్మాదం పెచ్చరిల్లుతోందని, ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్ పరివార్ శక్తుల దాడులు పెరిగాయని వారు ఆందోళన వ్యక్తంచేశారు. దాడులను అరికట్టి అన్నివర్గాల విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సెంట్రల్ యూనివర్సిటీని రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. రోహిత్ మృతిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. రోహిత్ తమ్ముడికి పర్మినెంట్ ఉద్యోగంతోపాటు ఆ కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఐ.బయ్యన్న (ఏఐఎస్‌ఎఫ్), డి. నారాయణరెడ్డి (వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్), కరీముద్దీన్ (స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్) పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

అందుకే నాంపల్లి ప్రమాదం జరిగింది: అగ్నిమాపక శాఖ

రేవంత్‌రెడ్డిపై తెలంగాణ సీఈవోకు ఫిర్యాదు

నాంపల్లి ప్రమాదంపై రేవంత్‌ దిగ్భ్రాంతి.. సర్కార్‌పై ఫైర్‌

నాంపల్లి భారీ అగ్ని ప్రమాదం ఘటనపై కేసు నమోదు

Nov 13th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌